- అగ్రికల్చర్ కే కాదు..మార్టిగేజ్ కింద కూడా ఇవ్వట్లేదు
- పోడు పట్టా పాస్‌బుక్స్ ఇచ్చినా ప్రయోజనం లేదు
- ప్రైవేటుగా అధిక వడ్డీలకు తెచ్చుకుంటూ ఇబ్బందులు
- బ్యాంక్‌రుణాలు ఇప్పించాలని సర్కార్ ను కోరుతున్న రైతులు
మహబూబాబాద్, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత రైతులు ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటుండగా గతేడాది రాష్ట్ర సర్కార్ పట్టాపాస్ బుక్ లు ఇచ్చింది. ఇక తమ వ్యవసాయ రుణాలకు ఇబ్బందులు తీరుతాయని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. 2023, జూన్‌లో ఉమ్మడి జిల్లాలో పోడు భూములు సాగు చేసుకునే రైతులను గుర్తించి పట్టా పాస్బుక్స్పంపిణీ చేసింది. వ్యవసాయ రుణాలు కోసం బ్యాంకర్లు వద్దకు వెళితే ఇవ్వడం లేదు.
రైతులు పాస్‌బుక్‌లు పట్టుకుని బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. అగ్రికల్చర్ లోన్లు, కనీసం మార్ట్గేజ్లోన్లు కూడా ఇవ్వడంలేదు. దీంతో రైతులు ప్రైవేట్రుణాలను అధిక వడ్డీలకు తెచ్చుకోవాల్సిన దుస్థితి పట్టింది. రైతు బంధుమినహా ఎలాంటి ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రభుత్వ రూ.2లక్షల రైతు రుణ మాఫీ కూడా పోడు పట్టాల రైతులకు దక్కకుండా పోయింది.
తొలగిన ఫారెస్ట్‌ఆఫీసర్ల ఇబ్బందులు
గతంలో ఏజెన్సీ ఏరియాలో పోడు భూములను సాగు చేసుకుంటే ఫారెస్ట్ఆఫీసర్లు వెళ్లి అడ్డుకునేవారు. రైతులు పంటలను ధ్వంసం చేసేవారు. ఇక ప్రభుత్వం అధికారికంగా పోడు పట్టాలను పంపిణీ చేసిన తర్వాత అధికారు ల నుంచి ఇబ్బందులు తప్పాయి. కొత్తగా పోడు సాగు చేస్తేనే అడ్డుకుంటున్నారు. గత కొన్నేండ్లుగా సాగు చేస్తుకుంటున్న పోడు పట్టా రైతులను ఆఫీసర్లు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదు.
బ్యాంక్ ఆఫీసర్లు లెక్క చేస్తలేరు
పోడు భూమి 2.12 ఎకరాలకు పట్టా పాస్ బుక్పొందాను అవి తీసుకుని వ్యవసాయ రుణం కోసం బ్యాంక్‌లకు వెళ్తే అధికారులు లెక్క చేస్తలేరు. లోను ఇవ్వకపోతుండగా.. మాకు రుణమాఫీ కూడా వర్తించడంలేదు. పోడు రైతులంటే రానివ్వడం లేదు. బ్యాంక్రుణాలను అందించేలా ప్రభుత్వం పట్టించుకోవాలి.
- బోడ వెంకన్న, పోడు రైతు, తేజావత్ రామ్‌సింగ్ తండా, గూడురు మండలం, మహబూబాబాద్ జిల్లా
పంట లోన్ కోసం తిరిగి విసిగిపోయా..
నేను పోడు భూమి 5.20 ఎకరాలకు పట్టాబుక్ పొందాను. పంట రుణం కోసం కొత్తగూడలోని ఇండియన్బ్యాంక్కు వెళ్తే ఇవ్వమన్నారు. పీఏసీఎస్‌లు, ఇతర మండలాల్లోని బ్యాంక్‌ల చుట్టూ తిరిగినా ఎవ్వరు ఇవ్వడం లేదు. పెట్టుబడి కోసం ప్రైవేట్‌గా ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చుకుని సాగు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నాం.
- సిద్దబోయిన రమ, పోడు పట్టా రైతు, గాంధీనగర్, కొత్తగూడ మండలం, మహబూబాబాద్ జిల్లా