నకిలీ విత్తనాలతో నష్టపోయాం.. కొడంగల్ లో హైవేపై రైతుల ధర్నా

కొడంగల్​, వెలుగు: నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయామని ప్రభుత్వం తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కొడంగల్​లో  రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం నాచారం, రేగడి మైల్వార్​, ఎనికేపల్లి, లింగంపల్లి, అల్లిఖాన్​పల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు ముందుగా ఓం ట్రేడింగ్​ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్​షాప్​వద్ద  బిల్లులు పట్టుకుని ధర్నా చేయగా.. షాప్ ఓనర్ స్పందించకపోగా హైవే –163 పైకి వచ్చి ధర్నా చేశారు. రైతులు మాట్లాడుతూ.. ఓం ట్రేడింగ్ షాప్ ఓనర్ ఎకరాకు 100 బస్తాల దిగుబడి వస్తుందని నమ్మించి విజయదుర్గా కంపెనీకి చెందిన వరి విత్తనాలను అంటగట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఎకరాకు10 బస్తాలకు మించి దిగుబడి రాలేదని, నకిలీ విత్తనాలతో ఎకరాకు రూ.25వేల వరకు నష్టపోయామని వాపోయారు. విత్తనాలు, కాలం చెల్లిన రసాయన మందులతో నిండా మునిగిన తమను అధికారులు ఆదుకోవాలని కోరారు. రైతుల ధర్నాతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  కాలం చెల్లిన కంది విత్తనాలు అమ్ముతున్నారని ఇదే షాపు ఓనర్ పై రైతులు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.