రామాయంపేట, వెలుగు : తమ పట్టాభూమిని 25 ఏళ్లుగా సాగు చేస్తుంటే నేడు కొందరు దాన్ని లాక్కోవడానికి చూస్తున్నారని అదే జరిగితే ఆత్మ హత్యలే శరణ్యమని, తమకు న్యాయం చేయాలంటూ రైతులు కుటుంబంతో సహా పురుగుల మందు డబ్బాలతో సోమవారం రామాయంపేట తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా చేశారు. బాధితుల కథనం ప్రకారం.. రామాయంపేటకు చెందిన అన్నమైన రాజయ్య, మల్లయ్యకు పట్టణ శివారులోని 1,547 సర్వే నంబర్ లో 2 ఎకరాల పట్టా భూమి ఉంది. దీన్ని ఇటీవల పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా దున్ని ఇది మా భూమే అని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని భూ యజమానులు ఆరోపిస్తున్నారు.
తమ భూమి లాక్కొని అన్యాయం చేస్తున్నారంటూ సదరు భూ యజమానులు కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ ఆఫీస్కు తరలివచ్చి పురుగుల మందు డబ్బాతో ఆందోళన వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా పట్టా భూమిని సాగు చేసుకుంటున్నామని, నేడు దాన్ని లాక్కునేందుకు పట్టణానికి చెందిన ఇద్దరు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఇదే జరిగితే తమకు ఆత్మ హత్యలే శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాకు న్యాయం చేయాలని వారు కోరారు. భూమిలో అక్రమంగా చొరపడ్డారన్న ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని, ఏదైనా ఉంటే కోర్టు ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఎస్ఐ రంజిత్ సూచించారు.