పూర్వాంచల్‌‌ సోలార్‌‌ ప్లాంట్‌‌ వద్ద రైతుల ధర్నా.. ఎస్సారెస్పీ నీరు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం

మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారంలోని పూర్వాంచల్‌‌ సోలార్‌‌ ప్లాంట్‌‌ కారణంగా తమ పంట పొలాలకు ఎస్సారెస్పీ నీరు రావడం లేదంటూ పలువురు రైతులు మంగళవారం కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ప్లాంట్‌‌ సిబ్బందికి, రైతులకు మధ్య సుమారు గంట పాటు గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్లాంట్‌‌ ఎదుట శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను ప్లాంట్‌‌ నిర్వాహకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ టైంలో బుద్దార్థి సంజీవ్‌‌ అనే రైతు తమకు న్యాయం చేసేవారు లేరంటూ పురుగుల మందు డబ్బా పట్టుకొని నిరసన తెలిపాడు. గమనించిన పోలీసులు పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ ఎస్సారెస్పీ ఎల్‌‌ 6 ప్రధాన కాల్వను ఆధారం చేసుకునే పంటలు సాగు చేస్తున్నామని, ప్లాంట్‌‌ నిర్వాహకులు కాల్వను ఆక్రమించి నీరు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసర్లకు, ప్లాంట్‌‌ నిర్వాహకులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదని, ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. 20 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ప్లాంట్‌‌ నిర్వాహకులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.