ఆయిల్ పామ్​ సాగు అంతంతే .. సంగారెడ్డి జిల్లాలో ఆసక్తి చూపని రైతులు

  • గతేడాది 2 వేల ఎకరాల లక్ష్యానికి 570 ఎకరాల్లోనే సాగు
  • ఈ సారి 3 వేల ఎకరాలకు 1,400 ఎకరాల్లోనే సాగు
  • 26 మండలాలకు కేవలం 6 మండలాల్లోనే సాగు

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారు. మరోవైపు ఉద్యానవన శాఖ రైతుల్లో అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది 2 వేల ఎకరాల్లో ఆయిల్​పామ్​సాగు చేయాలనే లక్ష్యం ఉండగా కేవలం 570 ఎకరాల్లో  మాత్రమే పంట వేశారు. ఈసారి 3 వేల ఎకరాలకు 1,400 ఎకరాల్లో మాత్రమే సాగుచేస్తున్నారు. ఒక్కసారి ఆయిల్​పామ్ పంట వేస్తే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది.  ఈ పంటపై రైతులకు అవగాహన కల్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

6 మండలాల్లోనే సాగు

జిల్లాలో ఉన్న 26 మండలాల్లో కేవలం 6 మండలాల్లోనే ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. అది కూడా చిన్న, సన్నకారు రైతులే పంటలు వేశారు. పెద్ద రైతులు ముందుకురావడం లేదు.  జిల్లాలో  జహీరాబాద్, కోహిర్, న్యాల్కల్, మొగుడంపల్లి, నారాయణఖేడ్, మనూర్ మండలాల్లో ఆయిల్ పామ్ సాగు కాస్త బెటర్ గా కనిపిస్తోంది. మిగతా మండలాల్లో చూద్దామన్న ఆయిల్ పామ్ తోటలు కనిపించడం లేదు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టి రైతులను ప్రోత్సహించాలని రైతు సంఘాలు సూచిస్తున్నాయి. 

రెండేళ్ల కింద ప్రభుత్వం అనుమతి

ఆయిల్ పామ్ సాగు కోసం రెండేళ్ల కింద ప్రభుత్వం అనుమతించింది. ఇందుకుగాను ఓ ప్రైవేట్ కంపెనీకి సంగారెడ్డి జోన్ ను కేటాయించింది. ఆ కంపెనీ యాజమాన్యం జిల్లాలోని కోహిర్ లో నర్సరీని ఏర్పాటు చేసి అక్కడ మొక్కలను పెంచుతోంది. ఆయిల్ పామ్ సాగు కోసం ముందుకు వచ్చే రైతులకు ఆ మొక్కలను ఉచితంగా అందిస్తున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా ఆయా రైతులకు డ్రిప్ సౌకర్యాన్ని సబ్సిడీ ద్వారా కల్పిస్తున్నారు.

ఎకరాకు 54 నుంచి 57 మొక్కలను ఇస్తున్నారు. ఆ మొక్కలు నాటాక 4 నుంచి 5 ఏళ్లకు దిగుబడి మొదలవుతుంది. 8 ఏళ్లు దాటాక పూర్తిస్థాయిలో పంట చేతికొస్తుంది. ఈ రకంగా 30 ఏళ్ల పాటు పంట దిగుబడి వస్తూనే ఉంటుందని ఉద్యానవన  శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాకు కేటాయించిన కంపెనీనే రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తోంది.