పార్ట్​ బీ సమస్యతో అరిగోస .. 400 మందికి అందని కొత్త పాస్​బుక్​లు

  • బీఆర్ఎస్​ హయాంలో 1500 ఎకరాలు వివాదస్పదంగా గుర్తింపు
  • ప్రభుత్వ పథకాలు వర్తించక నష్టపోతున్న రైతులు
  • కాంగ్రెస్ ప్రభుత్వమైనా సమస్య పరిష్కరించాలని విన్నపం

మెదక్, శివ్వంపేట, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ ప్రక్షాళన కొందరికి శాపంగా మారింది. భూములను పార్ట్ బీ లో పెట్టడంతో కొత్త పాస్ బుక్ లు రాక ప్రభుత్వం అమలు చేసే ఏ పథకాన్ని వారు పొందలేకపోతున్నారు. శివ్వంపేట మండలం నవాపేట్ గ్రామ పరిధిలోని వివిధ సర్వే నెంబర్లలో ఉన్న దాదాపు 1,500 ఎకరాల భూమిని సుమారు 400 మంది  రైతులు తాత, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు.1992, 1993 లో అప్పటి ప్రభుత్వం ఆ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు అసైన్​మెంట్​సర్టిఫికెట్లు ఇచ్చింది. 

అలాగే 2005లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూ పంపిణీ పథకం కింద అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా కొందరు రైతులకు పట్టా సర్టిఫికెట్లు. పాస్ పుస్తకాలు ఇచ్చారు. కాగా 2017లో  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూ ప్రక్షాళన సమయంలో నవాపేట పరిధిలోని 1,500 ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉందని చెప్పి పార్ట్- బీ లో పెట్టారు.  సర్వే నంబర్ 417లో 177 ఎకరాల 34 గుంటలు,  సర్వే నంబర్ 309లో 331 ఎకరాల 25 గుంటలు,  సర్వే నంబర్ 262లో 387 ఎకరాల 24 గుంటలు, సర్వే నంబర్ 236లో 288 ఎకరాల 33 గుంటలు, సర్వే నంబర్ 216లో 164 ఎకరాల 34 గుంటలు పార్ట్ బీలో పెట్టారు. 

దీంతో ఆయా సర్వే నెంబర్లలోని భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్న దాదాపు 400 మంది రైతులకు కొత్త పాస్ బుక్ లు రాలేదు. దీనివల్ల ఆయా రైతులకు రైతుబంధు, రైతు బీమా వర్తించడం లేదు. క్రాప్ లోన్లు పొందలేక పోతున్నారు. రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఏండ్ల తరబడిగా అది అమలుకు నోచుకోవడం లేదు. రైతులు తహసీల్దార్  మొదలుకుని కలెక్టర్ వరకు, రేంజ్ ఆఫీసర్  మొదలుకుని డీఎఫ్ వో వరకు అందరు అధికారుల చుట్టూ తిరుగుతున్నా, ఎమ్మెల్యే, మంత్రులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఏండ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాక రైతులు తీరని వ్యధను అనుభవిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పెట్టి ధరణి సమస్యలు పరిష్కరిస్తున్నందున అదే క్రమంలో పార్టీ బీ సమస్య కూడా పరిష్కరించాలని నవాపేట రైతులు కోరుతున్నారు.

పాస్ బుక్ లు రాక  లోన్లు ఇస్తలేరు 

మూడెకరాల భూమి వంశపారంపర్యంగా సాగు చేసుకుంటున్నాం. 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ పంపిణీ పథకం కింద ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్​లో పార్ట్ బీలో పెట్టి పాస్ బుక్ లు ఇయ్యలేదు. దీంతో పహణీలు వస్తలేవు, బ్యాంకులో లోన్ లు ఇస్తలేరు. రైతుబంధు, రైతు బీమా ఏదీ వస్తలేదు. సీఎం రేవంత్ రెడ్డి మాపై దయ తలిచి కొత్త పాస్ పుస్తకాలు ఇప్పిస్తే చాలా నయమైతది.

భాషయ్య, రైతు, నవాపేట

కాస్తులో ఉన్నా బెనిఫిట్స్ వస్తలేవు 

నాకు సర్వే నెంబర్ 236లో 2  ఎకరాల భూమి ఉంది. మా తాత కాలం నుంచి ఆ భూమి సాగు చేసుకుంటున్నాం. 2005లో  పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు. కానీ పోయిన గవర్నమెంట్ ల కొత్త పాస్ బుక్ ఇయ్యలేదు. దీంతో కాస్తులో ఉన్నప్పటికీ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమి వస్తలేవు. ఏండ్లు గడుస్తున్నయి కానీ సర్వే చేసి పాస్ బుక్ లు ఇస్తలేరు - భాస్కర్, రైతు, నవాపేట

జాయింట్ సర్వే చేసి 

పాస్ బుక్ లు ఇస్తాం నవాపేటలోని భూములపై ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్​మెంట్​మధ్యలో వివాదం ఉంది. జాయింట్ సర్వే చేసి అర్హులైన రైతులందరికీ కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. 

జగదీశ్వర్ రెడ్డి, నర్సాపూర్ ఆర్డీవో