మోదీ ప్రభుత్వ విధానాలతో రైతుల బతుకులు ఆగమాగం

బీజేపీ సారథ్యంలోని మోదీ ప్రభుత్వ  రైతు వ్యతిరేక విధానాలతో  దేశవ్యాప్తంగా  రైతుల బతుకులు రోజురోజుకూ దిగజారుతున్నాయి.  దేశప్రజలకు,  జాతికి  ఆహార భద్రత కల్పిస్తున్న  రైతులు మన పాలకుల నిర్లక్ష్యంతో ఈ రోజు పంట రుణాలు, పైవేట్‌‌‌‌‌‌‌‌ అప్పులు అందని స్థితిలో  వ్యవసాయం చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  రైతులకు న్యాయంగా దక్కవలసిన ఫలితం మన ప్రభుత్వాలు అందించనందున ప్రభుత్వపరంగా ప్రతి రోజు ఏమైనా సహాయం అందుతుందా అని ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.   ప్రతిసారి రుణ మాఫీ డబ్బులు,  రైతు భరోసా డబ్బులు, పంటనష్ట పరిహారం డబ్బులు మొదలగునవి ఎప్పుడెప్పుడు వారి ఖాతాలో జమ చేస్తారో అని ఎదురుచూస్తుంటారు.  ఈ దీనస్థితి  ఇంకెన్నాళ్లు? 


రైతుల ఆర్థికస్థితిని శాసించే అనేక అంశాలు కేంద్ర  ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు,  రాష్ట్ర ప్రభుత్వం  రుణ మాఫీతో సహా తలకు మించిన భారంతో ఎన్ని విన్యాసాలు చేసినా  రైతుల సమస్యలు  శాశ్వతంగా పరిష్కారం కావు. ప్రధాని  నరేంద్ర మోదీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో  తెలిసో తెలియకో  రైతులు ఆర్థికంగా  బాగుపడడానికి చెప్పుకోతగ్గ  ఒక్క చర్య కూడా చేపట్టలేదు.  ఫలితంగా పంటలు మంచిగా  పండినప్పటికీ  మన రాష్ట్రంతో పాటు మొత్తం దేశంలో ఒక్క రైతు కూడా తన సంపాదనతో  కుటుంబ సభ్యుల పేర కనీసం 10 వేల రూపాయలు కూడా బ్యాంకులో డిపాజిట్‌‌‌‌‌‌‌‌  చేసుకోలేకపోతున్నాడు.  మెజారిటీ రైతులు పంట రుణాలతోబాటు, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ అప్పులపాలై అధిక వడ్డీ  భారం మోయలేక దినదిన గండంగా గడుపుతున్నారు.  మోదీ నాయకత్వంలో  మన దేశం ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినప్పటికీ  దేశ జనాభాలో 50% పైగా  ఉన్నటువంటి రైతులు, వారి కుటుంబ సభ్యులకు.. పెరిగిన దేశ సంపదతో  ఏమాత్రం మేలు జరగక నేటికీ  అప్పుల బాధతో బతుకుతున్నారు. 

నష్టపోతున్న రైతులు 

 రైతు పండించిన పంటకు అయ్యే ఖర్చులను తక్కువగా లెక్కించి, ప్రధాన పంటలన్నిటికి  క్వింటాల్‌‌‌‌‌‌‌‌ కు  వెయ్యి నుంచి 3 వేల రూపాయల ధర తగ్గించి ఎంఎస్పీ  నిర్ణయించడంతో రైతులు జీవిత కాలం  కష్టపడుతున్నా బాగుపడే అవకాశం కలగడం లేదు.  రాష్ట్ర ప్రభుత్వం 2024-–25 సంవత్సరానికి గాను స్వామినాథన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ సూచనల ప్రకారం సీఏసీపీ కమిటీకి వివిధ పంటలకు ఎంఎస్పీ నిర్ణయించవలసిందిగా సిఫారసు చేసిన రేట్లుకు విరుద్ధంగా తక్కువగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినది.  అతి తక్కువగా ఎంఎస్పీ  ప్రకటించినప్పటికీ,  కనీసం ప్రకటించిన ఎంఎస్పీకి కూడా చట్టబద్ధత  కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదు. అంటే  బహిరంగ మార్కెట్​లో  ప్రకటించిన  ఎంఎస్పీ కంటే  ధర  తక్కువ ఉంటే  తక్కువ ధరకే  పంటలను రైతులు అమ్ముకుని  నష్టపోతుంటే  కేంద్రం మాత్రం తమకు సంబంధం లేదన్నట్టు  వ్యవహరించడం ఎంతవరకు సమంజసం?  పంటల బీమా పథకం సమర్థవంతంగా  అమలు చేయడం లేదు. ప్రతి సంవత్సరం పలు కారణాల వల్ల కోట్ల హెక్టార్ల పంటలు దెబ్బతింటున్నాయి.  ప్రతి సమయంలో తప్పులను రాష్ట్ర  ప్రభుత్వాలపైన తోసివేసి తప్పించుకునే పద్ధతి  అవలంబించడంతో  రైతులు చాలా నష్టపోతున్నారు.  కోలుకోలేనివిధంగా జరిగిన పంట నష్ట పరిహారానికి  రైతులు ఎవరితో  చెప్పుకోవాలో  తెలియని పరిస్థితి నెలకొంది. కార్పొరేట్​ శక్తులకు రుణమాఫీ,రైతులకు మొండిచేయి 

మోదీ నాయకత్వంలో  కేంద్రం  పైరవీకారులకు,  పలుకుబడిగలవారికి, కార్పొరేట్‌‌‌‌‌‌‌‌  శక్తులకు, ఎగవేతదారులకు ఎలాంటి నియమాలు పాటించకుండా వేలాది కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేస్తోంది.  కానీ, మన బాంకులు నిజాయతీగా కష్టపడి  పనిచేస్తున్న రైతులకు ప్రైవేట్​అప్పుల అధిక వడ్డీ భారం నుంచి కాపాడడానికి కనీసం 2-–3 లక్షల రూపాయల అప్పు కూడా ఇవ్వడం లేదు.  మోదీ నేతృత్వంలోని  కేంద ప్రభుత్వం 2016 సంవత్సరంలో  రైతుల ఆదాయాన్ని 2022 సంవత్సరం నాటికి రెట్టింపు చేస్తామని ప్రకటించి ఆ దిశలో ఒక్క అడుగు కూడా ముందుకువెయ్యక దేశవ్యాప్తంగా రైతులను మోసం చేసింది.  కేంద్రప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలకుపైగా కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ శక్తుల,  పలుకుబడి గల వారి బ్యాంకుల మొండి రుణాలను రద్దు చేసింది.  కానీ,  రైతుల బ్యాంక్‌‌‌‌‌‌‌‌ రుణాలు మాఫీ చేయడానికి ఇష్టపడటం లేదు.   కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న పథకం ‘ప్రధాన మంత్రి  కిసాన్‌‌‌‌‌‌‌‌ సమ్మాన్‌‌‌‌‌‌‌‌ నిధి’  ఈ పథకం ద్వారా  సంవత్సరానికి 6000 రూపాయలు పేద రైతులకు అందజేస్తున్నారు.  ఇది ఒక్క రోజుకు కేవలం 16.48 రూపాయలు అవుతుంది. ఇంత తక్కువ మొత్తంతో రైతు కుటుంబం రోజుకు ఒక కప్పు చాయిని కూడా ఉచితంగా పాందడం చాలా కష్టం.  కేంద ప్రభుత్వం రైతులు బాగుండాలని కోరుకున్నప్పుడు, రైతుల ఆర్థికాభివృద్ధికి సహకరించే  అంశాలలో ఖర్చు లేకుండా కొన్ని,  అతి కొద్ది ఖర్చుతో  మరి కొన్ని అంశాలు రైతుకు అనుకూలంగా ఉండేవిధంగా  పరిష్కరించే  వీలున్నది.  రాష్ట్ర  ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని  రైతు ఆర్థికస్థితిని  శాసించే అనేక అంశాలు వెంటనే  రైతుకు లాభం కలిగేవిధంగా, అమలు చేసే విధంగా  కేంద్ర ప్రభుత్వంపై  ఒత్తిడి తేవాలని,  రైతుల న్యాయమైన అన్ని డిమాండ్లను అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటన్నిటిని వెంటనే పరిష్కరించాలని,  ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరుతున్నాం.

- పాకాల  శ్రీహరిరావు,
అధ్యక్షుడు, తెలంగాణ
రైతురక్షణ సమితి