కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో రైతులు నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. చర్చలకు రావాలని కేంద్రం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కేంద్రంతో చర్చలు జరుపుతామని తెలిపాయి.
ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ కు లేఖ ద్వారా పంపారు. లేఖలో నాలుగు అంశాల ఎజెండాను పేర్కొన్నారు. అందులో..
1.మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతుల పై చర్చ జరపాలి.
2.అన్ని రకాల పంటలకు జాతీయ రైతు కమిషన్ సూచించిన లాభదాయకమైన MSPకి చట్ట బద్దత కల్పించాలి.
3. ఢిల్లీ రాజధాని పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్ కు సవరణలు చేయాలి. ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుండి రైతులను మినహాయించాలి
4. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ‘విద్యుత్ సవరణ బిల్లు 2020’ ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయడం పై చర్చ జరపాలి.
కేంద్రంతో మనసుపెట్టి చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ లేఖలో పేర్కొన్నాయి రైతు సంఘాలు.
