ఢిల్లీ బార్డర్‌లో కొనసాగుతున్న ఆందోళన
ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేసిన రైతులు
అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
న్యూఢిల్లీ: చర్చలకు తాము ఎప్పుడూ రెడీ అని, అయితే కేంద్రమే డేట్ ఫిక్స్ చేయాలని ఢిల్లీ బార్డర్ లో ఆందోళన చేస్తున్న రైతు నాయకులు చెప్పారు. మరోసారి చర్చలకు రావాలంటూ కేంద్రం పంపిన లెటర్ లో కొత్తదేమీలేదన్నారు. కేంద్రం ప్రపోజల్ పై మంగళవారం ఏక్తా మోర్చా మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సోమవారం భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) లీడర్ రాకేశ్ టికాటి మాట్లాడుతూ.. ‘కొత్త అగ్రి చట్టాల్లో సవరణల ప్రతిపాదనపై మరోసారి చర్చలు జరుపుదామని కేంద్రం లెటర్ పంపింది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. మరో రౌండ్ చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ వివేక్ అగర్వాల్ 40 యూనియన్ల లీడర్లకు లెటర్ రాశారు. కనీస మద్దతు ధరకు రాతపూర్వక భరోసాతోపాటు ఈ నెల 9న అగ్రి చట్టాల్లో 7 అంశాలకు సవరణలకు చేసిన ప్రతిపాదనపై మరోసారి చర్చించేందుకు డేట్ ఫిక్స్ చేయాలన్నారు. రైతుల ఆందోళనలను పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్రమే డేట్ ఫిక్స్ చేయాలె..
‘చర్చలకు డేట్ ఫిక్స్ చేయాలని కేంద్రం మమ్మల్ని అడగడం సరికాదు. కేంద్రం ఏం చెబుతుందో వినేందుకే మేము రోజంతా రోడ్లపైనే బైఠాయించాం. వాళ్లకే బిజీ షెడ్యూల్ ఉంటుంది. మాకు కాదు. వాళ్లే మాకు డేట్ ఇవ్వాలి. మా టెంట్ల వద్దకు వచ్చి మేము ఎలా ఉంటున్నామో చూడాలి. మాతో చర్చకు రావాలి’ అని ఆలిండియా కిసాన్ సమితి (పంజాబ్) అసిస్టెంట్ సెక్రటరీ కాశ్మీర్ సింగ్ అన్నారు. మా ప్రపోజల్స్ ను కేంద్రానికి పంపాం. వాళ్ల ప్రపోజల్స్ లోని అంశాలను పాయింట్ ఔట్ చేశాం. మంగళవారం ఏక్తా మోర్చా మీటింగ్‌లో కేంద్రం పంపిన లెటర్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటం’ అని క్రాంతికారి కిసాన్ యూనియన్ లీడర్ గుర్మీత్ సింగ్ చెప్పారు. ‘కొత్త చట్టాలు రైతులకు వ్యతిరేకం. కార్పొరేట్లకు మేలు చేసేందుకే సర్కారు వీటిని తెచ్చింది. అందుకే చర్చలు కొలిక్కి రావడం లేదు. మా డిమాండ్ ఒక్కటే. చట్టాలను వెనక్కి తీసుకోవాలి. అప్పటి దాకా ఇక్కడి నుంచి కదలం’ అని అంబేద్కర్ సంఘర్ష్ మోర్చా హర్యానా స్టేట్ ప్రెసిడెంట్ రామ్ సింగ్ స్పష్టం చేశారు.
ఒకరోజు నిరాహార దీక్ష
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు. ఢిల్లీ బార్డర్ లో సోమవారం రిలే నిరాహార దీక్ష చేశారు. సింఘు బార్డర్ తో పాటు అన్ని చోట్ల11 మంది చొప్పున బ్యాచ్ లవారీగా నిరాహార దీక్ష చేసినట్టు రైతు నాయకులు చెప్పారు. సింఘు బార్డర్ లో లూధియానాకు చెందిన రెహ్రాస్ సేవా సొసైటీ ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో వందల మంది రైతులు పాల్గొని రక్తదానం చేశారు.
