రైతుల బాధల గురించి, వారి కష్టాలు, ఆ కష్టాల తగ్గ ఫలితాల గురించి సినిమాల్లో చూపిస్తే జనం కన్నీళ్ల పర్యంతమై వాటికి కాసుల వర్షం కురిపిస్తారు. అదే రియల్ లైఫ్‌లో అయితే రైతులకి కలిగే నష్టం గురించి కాకుండా తమకొచ్చే లాభం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇలాంటి ఓ సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో చోటుచేసుకుంది. జహానాబాద్ టౌన్‌కు చెందిన మహ్మద్ సలీమ్ అనే వ్యక్తి తనకున్న పొలంలో క్యాలీఫ్లవర్ పంట పండించాడు. ఆ పంటను అమ్ముకోవటానికి మార్కెట్ యార్డ్‌కు తీసుకురాగా.. అక్కడి దళారులు కిలో క్యాలీఫ్లవర్ రూ.12నుంచి రూ.14 గా ఉన్న రీటైల్ ధర ను.. కేవలం ఒక రూపాయిగా నిర్ణయించి, ఆ ధరే చెల్లిస్తామన్నారు. తాను కష్టపడి పండించిన పంటను అంత తక్కువ ధరకి అడగడంతో సలీమ్ ఆ బాధను తట్టుకోలేక తన 10 క్వింటాళ్ల పంటను రోడ్డు పాలు చేశాడు.
ఆ పంట పండించడం కోసం, దాన్ని మార్కెట్ కు తరలించడం కోసం ఇప్పటి వరకూ రూ.12,000 ఖర్చు కాగా.. కిలో కాలీఫ్లవర్ ధర రూ.1 గా నిర్ణయించడంతో సలీమ్ భరించలేకపోయాడు. తిరిగి వాటిని ఇంటికి తీసుకొచ్చేంత డబ్బు లేక ఆ పంటనంతా రోడ్డు పాలు చేశాడు. దీంతో రోడ్డు మీద పడిన తాజా క్యాలీఫ్లవర్స్‌ను సొంతం చేసుకోవటానికి జనం ఎగబడ్డారు.
