సజీవ దహనానికి యత్నం.. రైతుకు రూ.9.91 లక్షల జరిమానా

జైపూర్: రాజస్థాన్‎లో ఆసక్తికర ఘటన జరిగింది. తన భూమికి పరిహారం కోరుతూ సజీవ దహనానికి యత్నించిన ఓ రైతుకు ఆ రాష్ట్ర పోలీసులు షాకిచ్చారు. ఆయనకు ఏకంగా రూ.9.91 లక్షల జరిమానా విధించారు. ఈమేరకు ఆదివారం నోటీసులు అందజేశారు. వారంలోగా స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తమ భూమిని తీసుకుంటున్న శ్రీ సిమెంట్​కంపెనీ నుంచి పరిహారం కోరుతూ ఝన్​ఝును జిల్లాకు చెందిన రైతు విద్యాధర్​యాదవ్​తన కుటుంబ సభ్యులతో ఈ నెల 10 న ఆందోళనకు దిగాడు.

నడిరోడ్డుపై చితి పేర్చుకొని, సజీవ దహనానికి యత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. అయితే, విద్యాధర్​సజీవ దహనాన్ని అడ్డుకునేందుకు ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు సహా 99 మంది పోలీసులతోపాటు పలు వాహనాలు మోహరించాల్సి వచ్చిందని రాజస్థాన్​ప్రభుత్వం​ పేర్కొంది. 

దీంతో రాష్ట్ర ఖజానాపై 9.91 లక్షల భారం పడిందని తెలిపింది. ఈ మొత్తాన్ని ఎస్పీ కార్యాలయం అకౌంట్స్ బ్రాంచ్‎లో జమ చేయాలంటూ రైతు విద్యాధర్ యాదవ్‎కు నోటీసులు జారీచేసింది. చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  కాగా, రైతు ఆందోళన తర్వాత సదరు కంపెనీ 3 కోట్ల పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నా.. పోలీసుల నోటీసుతో రైతు కుటుంబం ఖంగుతిన్నది.