మూడేళ్ల పగతో రగిలిన ప్రియుడు..,ప్రియురాలిని పట్టపగలే నడిరోడ్డుపై కాల్చిచంపాడు ప్రియుడు. హర్యానా ఫరిదాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. బాధితురాలు కాలేజీలో ఎగ్జామ్ రాసివస్తుండగా ఆమెను వెంబడించి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధితురాలు మృతి చెందింది.
ఫరిదాబాద్ కు చెందిన నిఖితా తోమర్ ను.., తౌసిఫ్ అనే యువకుడు 2018నుంచి ప్రేమిస్తున్నాడు. నిఖితా మాత్రం తౌసిఫ్ ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. కిడ్నాప్ కు కూడా ప్రయత్నించాడు. దీంతో నిఖితా, ఆమె కుటుంబసభ్యులు 2018లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును అంతగా పట్టించుకోలేదు. నాటి నుంచి ప్రియురాలిపై కక్ష పెంచుకున్న తౌసిఫ్ ఆమెను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తాజాగా ఆమె ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తుండగా..కాలేజీ బయటే ఆమెను కార్లో అపహరించేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన నిఖితా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నిందితుడు తనదగ్గరున్న రివాల్వర్ తో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా బాధితురాలు కన్నుమూసింది. అయితే బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం పోలీసుల నిర్లక్ష్యం వల్లే నా కూతురు చనిపోయిందని, తౌసిఫ్ పై 2018లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
