జయమ్మ మరణాన్ని జయించింది!

  • యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన మహిళ  
  • మరో 8 మందికి అవయవదానం   
  • మానవత్వం చాటుకున్న బాధిత కుటుంబసభ్యులు

మక్తల్, వెలుగు : బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి మానవత్వం చాటుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ టౌన్ శివాజీ నగర్‌ కు చెందిన చాకలి జయమ్మ(45) , గత నెల 24న కృష్ణ మండలం నల్లగట్టు మారెమ్మ ఆలయానికి మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లింది. ఆమె బస్సు దిగుతూ జారి కిందపడడంతో తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ జయమ్మ ఆదివారం బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె భర్త లక్ష్మణ్‌ను స్వచ్ఛంద సంస్థ సభ్యులు అవయవదానానికి ఒప్పించారు. నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ అసోసియేషన్ చొరవతో 8 మందికి అమర్చారు.  జయమ్మ మరణాన్ని జయించి.. ఎనిమిది మంది బాధితుల్లో వెలుగులు నింపింది.  ఆదివారం రాత్రి జయమ్మ అంత్యక్రియల్లో పట్టణ ప్రజలు భారీగా పాల్గొన్నారు.