పసి కందు మృతికి డ్యూటీ డాక్టరే కారణం .. శిశువు కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన

  • నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాస్పత్రి వద్ద ఘటన 

దేవరకొండ, వెలుగు : ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే పసికందు మృతి చెందినట్టు కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. దేవరకొండ సీఐ నరసింహులు తెలిపిన ప్రకారం.. దేవరకొండ మండలం మర్రిచెట్టు తండాకు చెందిన ముడావత్ రాహుల్ భార్య నందినికి నెలలు నిండడంతో కాన్పు కోసం మంగళవారం దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చారు. వైద్య సిబ్బంది నార్మల్ డెలివరీ కోసం వేచి చూడగా కాలేదు. 

మంగళవారం రాత్రి డాక్టర్లు గర్భిణి నందినికి ఆపరేషన్ చేయడంతో మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు ఉమ్మ నీరు తాగాడని,  ఆరోగ్య పరిస్థితి బాగోలేదని వెంటనే హైదరాబాద్ కు తరలించి చికిత్స అందించాలని డ్యూటీ డాక్టర్ కన్యాకుమారి చెప్పింది. దీంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు దేవరకొండ ఆస్పత్రికి వెళ్లి ఆందోళన చేశారు. శిశువు మృతికి కారణమైన డ్యూటీ డాక్టర్ కన్యాకుమారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.