జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో కల్తీ పాల వ్యవహారం కలకలం రేపింది. పట్టణంలోని కరబుజ లావణ్య కుటుంబం మేడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన రైతు మైదం మల్లయ్య దగ్గర పాలు కొంటున్నారు. కొద్దిరోజులుగా లావణ్యతో పాటు పిల్లలకు ఒంటిపై దద్దుర్లు, విరేచనాలు కావడంతో ఆస్పత్రి పాలయ్యారు. పాల వల్లే అనారోగ్యానికి గురయ్యామని భావించిన వారు.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పాలను టెస్ట్ చేయించగా అందులో 10 శాతం కూడా పాలు లేవని, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ఆ పాలను స్వాధీనం చేసుకున్న ఫుడ్ఇన్స్పెక్టర్ అనూష.. రైతు మల్లయ్య ఇంటికి వెళ్లి సోదాలు చేపట్టారు. అతడిని విచారించగా పాలు విరగకుండా తినే సోడాను కలిపానని, ఎలాంటి ఇతర రసాయనాలు కలపలేదని ఒప్పుకున్నట్లు ఆమె వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా చర్యలు ఉంటాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.