ఆస్తుల లొల్లిపై జగన్ రియాక్షన్.. షర్మిల కౌంటర్..

అమరావతి: వైఎస్ కుటుంబంలో ఆస్తుల లొల్లి ముదిరి పాకాన పడింది. వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదాలపై జగన్ బహిరంగంగా స్పందించారు. తన చెల్లి, తల్లి ఫొటోలు పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ విమర్శించారు. ‘మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా..? ఇవన్నీ ‘ఘర్ ఘర్ కీ కహానీలు’.. ఇవన్నీ ప్రతీ ఇంట్లో ఉన్న విషయాలే’ అని జగన్ చెప్పారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా స్పందించారు.

ఆమె ఏమన్నారంటే.. ‘మా ఉద్దేశం కూడా గొడవలను సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాలన్నదే. కానీ ఇది సామాన్యం అంటూనే, అన్ని కుటుంబాల్లో జరిగే విషయం అంటూనే తల్లిని, చెల్లిని కోర్టుకీడ్చారు. ఇది సామాన్యం కాదు జగన్ సార్’ అని షర్మిల మీడియా ముందు వ్యాఖ్యానించారు. అందరి కుటుంబాల్లో అమ్మల మీద, చెల్లెళ్ల మీద కోర్టులో కేసులేసుకుంటారా..?  కుటుంబంలో సమస్యలు ఉండటం కామనే. కానీ ఇట్లా అమ్మను కోర్టుకు లాగరు కద’ అని కూడా జగన్కు షర్మిల కౌంటర్ ఇచ్చారు.

అసలు అన్నాచెల్లి మధ్య గొడవేంటి..?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య, జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో జగన్ ఫిర్యాదు చేశారు. సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో తల్లి విజయమ్మకు తాను గిఫ్ట్‌ డీడ్‌గా ఇచ్చిన షేర్లను.. తనకు తెలియకుండా షర్మిలకు బదలాయించారని, దీన్ని రద్దు చేయాలని ఎన్సీఎల్టీని కోరారు.

ALSO READ | తల్లి, చెల్లిపై ఎన్సీఎల్టీకి జగన్

సరస్వతి పవర్‌ కంపెనీలో 99 శాతం షేర్లు జగన్‌కు, 1 శాతం షేర్లు విజయమ్మకు ఉన్నాయి. సీబీఐ, ఈడీ కేసుల్లో భాగంగా ఈ ఆస్తులను కూడా అటాచ్ చేశారు. వీటిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అయితే సరస్వతి సిమెంట్స్‌లో షర్మిలకు 49 శాతం షేర్లు ఇస్తానని జగన్‌ గతంలో చెప్పారు. నేరుగా షర్మిలకు బదిలీ చేయడం చట్ట విరుద్ధం కాబట్టి.. అప్పటికే 1 శాతం వాటాదారుగా ఉన్న తల్లికి ఈ షేర్లపై గిఫ్ట్‌ డీడ్‌ రాసిచ్చారు.

Family feud: Jagan Vs Sharmila

While the letters between the brother and sister and the family dispute have taken center stage in #Andhra politics, @ysjagan said on Thursday that the ruling @JaiTDP has exploited these letters and exaggerated the family dispute as a diversionary… https://t.co/ynCRs75TOh pic.twitter.com/Q7f0IHPArK

కేసులు తేలాక షర్మిల పేరు మీద బదిలీ చేసుకోవచ్చని జగన్‌ ఈ గిఫ్ట్‌డీడ్‌ను రాసిచ్చారు. కోర్టు కేసులు, అటాచ్‌మెంట్ లో ఉన్న ఆస్తిని క్రయవిక్రయాలు చేయడానికి వీల్లేదు. కానీ జగన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ డీడ్‌ను ఆధారంగా చేసుకుని విజయమ్మ దగ్గరి నుంచి షేర్లను షర్మిల బదిలీ చేయించుకున్నారు. కోర్టుల్లో కేసులు ఉండడంతో లీగల్ గా ఇబ్బందులు ఎదురవుతాయని న్యాయవాదులు హెచ్చరించడంతో జగన్‌ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు.