సంస్థాన్ నారాయణపురం, వెలుగు: యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో రూ.500 , రూ.100 దొంగ నోట్లు కలకలం రేపాయి. గురువారం సంస్థాన్ నారాయణపురంలోని వైన్ షాపులో రూ.500 నోటు రాగా వైన్స్ యజమాని నకిలీదిగా గుర్తించాడు. సంతలో కూరగాయలు అమ్మే చిరు వ్యాపారి దగ్గర రూ.100 నోటు నకిలీది రావడంతో మండలంలో దొంగనోట్లు చలామణి అవుతున్నాయని ప్రజలు భయపడుతున్నారు. ఈ విషయమై చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి స్పందిస్తూ దొంగ నోట్లు చలామణి చేస్తే, చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా దొంగ నోట్లు గుర్తిస్తే డయల్ 100కు లేదా పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని ఏసీపీ సూచించారు.