ఓఎల్ఎక్స్ వెబ్ సైట్ ద్వారా తక్కువ ధరకే తన కారు అమ్ముతున్నట్లు నమ్మబలికి సైబర్ క్రైమ్ కి పాల్పడ్డాడు ఓ నకిలీ ఆర్మీ ఉద్యోగి. అత్యవసర పరిస్థితుల్లో తన కారును అమ్మాల్సి వస్తుందన్న అతని మాయమాటలకు ఓ కారు డ్రైవర్ మోసపోయాడు. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఈ సైబర్ క్రైమ్ బయటపడింది.
పలమనేరు రంగాపురం వీధికి చెందిన కార్ డ్రైవర్ షాజిద్ భాషాకి OLX వెబ్ సైట్ లో పెట్టిన షిఫ్ట్ డిజెర్ కారు బాగా నచ్చింది. కారు కొందామని.. అందులో ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేశాడు. ఆ నంబర్ గల వ్యక్తి తాను ఆర్మీ ఉద్యోగినని, తన పేరు జైకిషాన్ అని చెప్పాడు. కొన్ని ఆర్ధిక పరిస్థితుల వల్ల 2017 మోడల్ గల తన కారును లక్షా 10 వేల రూపాయలకే అమ్ముతున్నానని భాషా ను నమ్మించాడు. తక్కువ ధరకే కారు వస్తుందనుకున్న భాషా ఆ బేరానికి ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఆ కారు ఆర్మీ క్యాంపులో ఉందని, మిలటరీ రవాణా చేసే వాహనాల ద్వారా కారును పంపుతానని, అందుకోసం రవాణా ఛార్జీలు నిమిత్తం రూ.2,000 కావాలన్నాడు. అందుకే సరేనన్న భాషా ఆన్లైన్ బ్యాంకింగ్ (google pay) ద్వారా డబ్బు పంపాడు.

ఆ మరుసటి రోజు షాజీద్ భాషాకు ఓ అపరిచిత వ్యక్తి కాల్ చేసి కారు తీసుకొని వస్తున్నానని, మార్గ మధ్యంలో తిరుపతి వద్ద GPRS సిగ్నల్ కట్ అయిందని తెలిపాడు. వేరే మార్గం ద్వారా కారు తీసుకొస్తున్నానని, ట్రాన్స్ పోర్టు ఖర్చుల కోసం రూ.17,250/- పంపాలని అన్నాడు. కాల్ చేసిన వ్యక్తి గురించి జై కిషన్ కి తెలుపగా.. అతను తన మనిషే నంటూ జై కిషన్ బదులిచ్చాడు. వెంటనే ఆ మొత్తాన్ని కూడా అన్ లైన్ ద్వారా ట్రాన్సఫర్ చేసిన బాషా.. , మరుసటి రోజు కు కూడా కారు రాకపోవడంతో కిషన్ కు మరోసారి కాల్ చేశాడు. అత్యవసరంగా ఇంక్కో 10వేల రూపాయలు తనకు ట్రాంఫర్ చెయ్యాలని కిషన్ కోరగా ఆ డబ్బునీ ట్రాన్స్ఫర్ చేశాడు భాషా.
గంటలు గడుస్తున్నా కారు రాకపోవడంతో అనుమానం వచ్చిన భాషా తన స్నేహితులకు జరిగిన విషయం గురించి తెలిపాడు. వారి సలహా మేరకు ఆన్ లైన్ లో సెర్చ్ చెయ్యగా.. ఇండియన్ ఆర్మీ కార్ స్కాం ద్వారా ఇప్పటికే తనకు కారు అమ్ముతానన్న జై కిషన్.. 3 సంవత్సరాలుగా పలుచోట్ల ఇటువంటి మోసాలకు పాల్పడ్డాడని తెలిసి కంగు తిన్నాడు. తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. SI నాగరాజు ఈ సైబర్ క్రైమ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. ప్రాథమిక విచారణలో హర్యానాకు చెందిన సైబర్ గ్యాంగ్ ఈ మోసానికి పాల్పడినట్టు ఆయన తెలిపారు.

