ముంబై: ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ మరికొన్ని నెలల్లో ప్రీ-పాండమిక్ లెవెల్‌కు (కరోనా ముందున్న స్థాయికి) చేరుకుంటుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో 75 శాతం పెరుగుతుందని సోమవారం విడుదలైన ఒక రిపోర్టు తెలిపింది. ఇంటర్నేషనల్ రూట్లు మెల్లమెల్లగా ఓపెన్ అవుతున్నాయి. దేశీయ ట్రాఫిక్ విపరీతంగా పెరగడం వల్ల ట్రాఫిక్ వాల్యూమ్ ఊపందుకుంటుందని దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రిపోర్టు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు తమ ట్రాఫిక్‌ను 2020 ఆర్థిక సంవత్సరం స్థాయికి పెంచుకోగలమన్న నమ్మకంతో ఉన్నారు. టారిఫ్‌ల పెరుగుదల ఫలితంగా రాబడి మరింత పెరుగుతుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ట్రాఫిక్ 34 కోట్ల మంది ప్రయాణికుల స్థాయికి పెరగవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఆగస్టు వరకు) ట్రాఫిక్ దాదాపు 2020 ఆర్థిక సంవత్సరం స్థాయిలో ఉంది. వ్యాపార ప్రయాణ సెంటిమెంట్ మెరుగుపడటం, పెరిగిన డిమాండ్ కారణంగా మిగిలిన నెలల్లో ఇది ఇంకా పుంజుకోవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో, దేశీయ ట్రాఫిక్ 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 92 శాతంగా ఉండగా, అంతర్జాతీయ ట్రాఫిక్ 75 శాతం మాత్రమే ఉంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక ముందు మరింత పెరుగుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధ్యపడుతుందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మనీష్ గుప్తా తెలిపారు. 2015– 2020 మధ్య ఆర్సీఎస్, ఉడాన్ వంటి పథకాలను అమలు చేయడంలో చిన్న నగరాలకు కూడా భారీస్థాయిలో విమాన సర్వీసులు పెరిగాయి. ఇదిలా ఉంటే మనదేశంలో నాలుగు విమానాశ్రయాలకు ఏరోనాటికల్ టారిఫ్‌లు దాదాపు 30 శాతం పెరిగాయి. ఫలితంగా ఆర్థిక సంవత్సరం 23లో ఏరోనాటికల్ ఆదాయం 120 శాతానికి చేరుకునే అవకాశాలు ఉంటాయి.
సీట్ల కోసం అదనంగా చెల్లించాల్సిందే...
దాదాపు మూడింట ఒక వంతు మంది విమాన ప్రయాణికులు గడచిన 12 నెలల్లో విమానంలో సీట్ల కోసం అదనపు డబ్బు చెల్లించాల్సి వచ్చిందని ఒక సర్వే తెలిపింది. సాధారణ సీటు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వే 351 జిల్లాల్లోని 30 వేల మంది నుంచి వివరాలు తీసుకుంది. సర్వే ప్రకారం, మొత్తం సీట్లలో 30 శాతానికి మాత్రమే పెయిడ్ సీట్ల సంఖ్యను పరిమితం చేయాలని 60 శాతం మంది రెస్పాండెంట్లు కంపెనీలకు సూచించారు. మిగతావి సాధారణ పద్ధతిలో ఇవ్వాలని కోరారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 2015లో సేవలను అన్‌బండ్లింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల భారతీయ విమానయాన సంస్థలు సీట్ల ఎంపిక, లగేజీ, ఎయిర్‌లైన్ లాంజ్‌ల వంటి సౌకర్యాల కోసం అదనపు ఛార్జీలు విధిస్తున్నాయి. కొంతమంది వినియోగదారులు తమకు నచ్చిన చోట సీట్లను తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇందుకు అదనంగా రూ. 200-–1,500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ముందు, అత్యవసర వరుసలలోని సీట్లు ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. బుకింగ్ లేదా వెబ్ చెక్--–ఇన్ సమయంలోనే అదనపు మొత్తం చెల్లించడం ద్వారా విమానంలో నచ్చిన సీట్లను రిజర్వ్ చేసుకోవచ్చు. కొన్ని ఎయిర్‌లైన్స్ ఇప్పటికీ విమానంలో అన్ని సీట్ల కేటాయింపు కోసం చార్జి వసూలు చేస్తున్నాయి. సాధారణ కేటాయింపు కోసం ఒక్క సీటు కూడా ఉంచడం లేదని చాలా మంది వినియోగదారులు లోకల్ సర్కిల్‌లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఫిర్యాదు చేస్తున్నారు. గత 12 నెలల్లో విమానాలను బుక్ చేసుకున్న ప్రతి ముగ్గురు ప్యాసింజర్లలో ఇద్దరు ఒకసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు కావల్సిన సీటును రిజర్వ్ చేయడానికి అదనంగా చెల్లించినట్లు చెప్పారు.
