చేవెళ్ల ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలు తెలపాలి : సెంథిల్ కుమార్

  • గడువులోపు ఇవ్వకుంటే నోటీసులు జారీ  
  • చేవెళ్ల లోక్ సభ వ్యయ పరిశీలకులు సెంథిల్ కుమార్, రాజీవ్ చాబ్రా

రంగారెడ్డి, వెలుగు:  చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్ నుంచి ఇటీవల ఎన్నికల్లో  పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు తాము ఖర్చు చేసిన వివరాలను నిర్ణీత గడువులోపు అందజేయాలని వ్యయ పరిశీలకులు సూచించారు. ఆదివారం రంగారెడ్డి కలెక్టరేట్ లో   ఎన్నికల వ్యయ పరిశీలకులు సెంథిల్ కుమార్, రాజీవ్ చాబ్రా  అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను, వ్యత్యాసాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చును బిల్లులు, ఓచర్లు, ఒరిజినల్ అఫిడవిట్, స్వీయ ధృవీకరణతో కూడిన బ్యాంకు స్టేట్‌‌మెంట్ తదితర వాటిని ఎన్నికల ఫలితాలు ప్రకటించబడిన రోజు నుంచి 30 రోజులలోపు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. గడువు ముగియనుండగా రికన్సీలేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బ్యానర్స్, పోస్టర్స్, దినపత్రికలు, టీవీ ఛానల్ లో ఇచ్చిన యాడ్స్ వివరాలు, వాటికైన ఖర్చుల వివరాలు కూడా తెలియజేయాలని సూచించారు.

అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను సకాలంలో, నిర్ణీత పద్ధతిలో సమర్పించకుంటే నోటీసులు జారీ చేస్తామని స్పష్టంచేశారు. నిర్ణీత కాల వ్యవధిలోపు స్పందించని వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 10A ప్రకారం అనర్హత విధించాలని కోరుతూ, ఎలక్షన్ కమిషన్ కు లేఖ పంపడం జరుగుతుందని తెలిపారు. ఈసీ ద్వారా అనర్హులుగా ప్రకటించబడిన వారు మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి చాన్స్ కోల్పోతారన్నారు.