రేవంత్ రెడ్డి పాలనలో మహిళా శక్తి ప్రజ్వరిల్లుతోంది..

అధికారంలోకి రావడానికి ఓటరు జాబితాలో సగం కొన్ని చోట్ల సగానికంటే ఎక్కువ ఉన్న మహిళా ఓటర్ల కోసం ఎన్నో పథకాలు ప్రకటిస్తాయి రాజకీయ పార్టీలు. తీరా అధికారంలోకి వచ్చాక షరా మామూలే.. కొన్ని పార్టీలు, పార్టీల నాయకులు మాత్రమే తాము ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ మహిళల ఉన్నతి కోసం ఆలోచిస్తారు.  ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న అనేక అంశాలు పరిశీలిస్తే.. గత ప్రభుత్వాల కన్నా మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు.

గత ప్రభుత్వం మహిళా కమిషన్  చైర్ పర్సన్, సభ్యులు నియామకానికి ఎంతో తాత్సారం చేస్తే..చివరికి  హైకోర్టు మొట్టికాయలు వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాజీ  మహిళా మంత్రిని  చైర్ పర్సన్​గా నియమించిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయాలు అన్నీ గమనించిన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు.  మహిళా శక్తికి గుర్తింపు ఆశించారు.  అందుకే తమ ఓటుతో ప్రభుత్వాన్ని మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది సంబురాలు చేసుకుంటున్న తరణంలో రాష్ట్రంలో పెరిగిన మహిళా ప్రాధాన్యత గురించి పరిశీలిస్తే.. మహిళలకు ఉచిత ప్రయాణం వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని అమలుచేస్తున్నారు. ఐదు వందలకే  గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు.  మొదటి ఏడాదిలోనే అత్యధిక హామీలను నెరవేర్చి ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

మహిళలకు కీలక శాఖలు
కేబినెట్లో  ఇద్దరు మహిళలు అనసూయ (సీతక్క), కొండా సురేఖలకు స్థానం కల్పించడంతో పాటు వారికి మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీశాఖ, దేవాదాయ శాఖ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  ప్రజావాణి కార్యక్రమానికి నోడల్ అధికారిగా దివ్య దేవరాజన్, ఐఏఎస్ ను నియమించారు. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్  కమిషనర్​గా  అమ్రాపాలి, ఐఏఎస్​ను నియమించారు. 

వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, శైలజా రామయ్యార్, అనితా రామచంద్ర, హరి చందన, విజయేంద్ర బోయి తదితర ఐఎఎస్ అధికారులకు కీలక బాధ్యతలు ఇచ్చారు. ( సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా అమ్రాపాలి, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ ఆంధ్ర సర్వీస్​కు బదిలీ అయ్యారు) సుమతి, ఐపిఎస్ ని ఇంటెలిజెన్స్ ఐజీగా నియమించారు. ఇలా ఎంతోమంది ప్రతిభ గల మహిళా అధికారులకు కీలకమైన శాఖలు కేటాయించారు. అంతేకాదు మొదటిసారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మహిళా అధికారిని నియమించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కీలక పాత్ర వహించే ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని  నియమించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళా శక్తి పై ఉన్న నమ్మకానికి తార్కాణం.

మహిళా సాధికారతే లక్ష్యం
ముఖ్యంగా పదవీ విరమణ చేసిన అంగన్ వాడీ కార్యకర్తలకు ఆర్థిక సహాయం,  అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల  ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధి పనులు,  మహిళా శక్తి సంఘాల సభ్యులకు ప్రత్యేక రుణ బీమా పథకం,  మహిళా శక్తి సంఘాల్లోని 65 లక్షల మంది మహిళలందరికీ ఐదు లక్షల రూపాయల జీవిత బీమా కల్పించడం వంటి అనేక అంశాలను మొదటి ఏడాదిలోనే చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. 

మహిళలు ఆర్థికంగా  ఎదగాలన్న లక్ష్యంతో మహిళా పొదుపు సంఘాలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు, అద్దె బస్సులు కేటాయిస్తూ ఐదేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. శిల్పారామం సమీపంలో నైట్ బజార్ లోని 106 స్టాళ్ల తో మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేస్తున్నారు.   రానున్న నాలుగేండ్లలో అన్ని రంగాల్లో మహిళా శక్తి ప్రజ్వలిస్తుందని, తమకు అండగా నిలిచే  ప్రభుత్వానికి మహిళలు అండగా ఉంటారని ఆశిద్దాం.  - విధాత్రి, హైదరాబాద్

నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు ప్రాధాన్యం
నామినేటెడ్ పదవుల విషయంలోనూ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవ్వరూ అడగకముందే మహిళా కమిషన్ చైర్మన్ గా నేరెళ్ల శారదను నియమించి మహిళల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అంతేకాదు రైతాంగ సాయుధ పోరాటంలో దొరల దురాగతాలకు ఎదురు నిలిచి, తమ హక్కు కోసం పోరాటం చేసి చరిత్రలో తనకంటూ ఒక పేజీని పదిలపరుచుకున్న చిట్యాల (చాకలి) ఐలమ్మ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆమె మనుమరాలుకు సభ్యురాలిగా అవకాశం కల్పించారు. ఎవ్వరూ ఊహించని విధంగా మహిళా యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడంతో పాటు లంబాడీ మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన ప్రొఫెసర్ సూర్య ధనంజయకు వైస్ ఛాన్స్ లర్ గా  అవకాశం ఇచ్చి జనాభాలో అత్యధిక శాతం ఉన్న వర్గాలకు న్యాయం చేశారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా సీనియర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అనితా రాజేంద్రను నియమించారు.  తెలంగాణ మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్  చైర్ పర్సన్ గా నిర్మలా జగ్గారెడ్డి, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ గా కాల్వ సుజాత, మహిళా సహకార అభివృద్ధి సంస్ధ (రాష్ట్ర మహిళా కోఆపరేటివ్‌‌‌‌ డెవలప్​మెంట్‌‌‌‌ కార్పొరేషన్) చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ బండ్రు శోభారాణిని నియమించారు.  ప్రజా యుద్ధ కవి గద్దర్​ను గౌరవిస్తూ ఆయన కుమార్తె డాక్టర్ వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్గా  నియమించారు.


విధాత్రి, హైదరాబాద్