సారూ.. మా వేతనాలు ఇంకెప్పుడిస్తారు..

  • మాజీ జెడ్పీ, ఎంపీపీ, ఎంపీటీసీల గౌరవ వేతనాలు పెండింగ్ 
  •  రాష్ట్రంలో ముగిసిన జెడ్పీ, మండల పరిషత్ ల పదవీకాలం 
  • నెలలుగా ఎదురు చూస్తోన్న మాజీ ప్రజాప్రతినిధులు 
  •  వచ్చే నెలలో మున్సిపల్​పాలకవర్గాల కాలం పూర్తి
  • రాష్ట్ర సర్కార్ స్పందించి త్వరగా ఇవ్వాలని కోరుతున్న మాజీలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు:  పదవీ కాలం పూర్తై నెలలు గడుస్తున్నా.. తమకు రావాల్సిన గౌరవ వేతనాల బకాయిలకు మాజీ ప్రజాప్రతినిధులకు ఎదురుచూపులు తప్పడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీల పదవీ కాలం ముగిసి నాలుగు నెలలు గడిచింది. ఇంకా గౌరవ వేతనాల బకాయిలు రావడంలేదు. మరో నెల రోజుల్లో మున్సిపల్​పాలకవర్గాల పదవీ కాలం కూడా ముగియనుంది. పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, కౌన్సిలర్లకు నెలల తరబడి గౌరవ వేతనాలు పెండింగ్​లోనే ఉన్నాయి. 

త్వరలో ఎన్నికలు వచ్చే చాన్స్ ఉన్నందున..

రాష్ట్రవ్యాప్తంగా 32 జెడ్పీలు,  535 మండల పరిషత్ ఉండగా.. 535 జెడ్పీటీసీలు, 453 ఎంపీపీ లు,5,984 ఎంపీటీసీలు ఉన్నారు. జడ్పీ చైర్మన్ నెలకు రూ. లక్ష జీతంతో పాటు దాదాపు రూ. 40వేలకు పైగా వెహికల్​ డీజిల్, ఇతరత్రా అలవెన్స్​లను ప్రభుత్వం చెల్లిస్తోంది.  జడ్పీ ఆఫీసులోని సంబంధిత ఆఫీసర్లు తమ జేబుల్లోంచి రూ. లక్షల్లో ఖర్చు పెట్టారు.

 ఇప్పుడు తరుచూ ఫోన్​చేసి డబ్బులెప్పుడొ స్తాయని అడుగుతూ ఒత్తిడి చేస్తున్నట్టు పలువురు జెడ్పీటీసీలు వాపోయారు. అదేవిధం గా జెడ్పీటీసీ నెలకు రూ. 13వేలు, ఎంపీపీలకు రూ. 10వేలు, ఎంపీటీసీలకు రూ. 5 వేలు గౌరవ వేతనంగా ఇస్తోంది. జెడ్పీ, మండల పరిషత్​ పాలకవర్గాల గడువు ఆగస్టుతో ముగిసింది. నాలుగు నెలలు గడిచినా.. పెండింగ్ వేతనాలు రిలీజ్​కాలేదు. త్వరలో జడ్పీ, మండల పరిషత్​లకు ఎన్నికలు వచ్చే చాన్స్ ఉన్నందున వెంటనే చెల్లించాలని మాజీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

వచ్చే నెలలో మున్సిపల్​ పాలక వర్గాలకు..

వచ్చే నెలలో మున్సిపల్​పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. రాష్ట్రంలో128కి పైగా మున్సిపాలిటీలున్నాయి. పలు మున్సిపాలిటీల్లో చైర్మన్లతో పాటు కౌన్సిలర్లకు గౌరవ వేతనాలు నెలల తరబడిగా బకాయిలున్నాయి. చైర్మన్లకు రూ. 15వేలు, కౌన్సిలర్లకు రూ. 3 వేలు చెల్లిస్తోంది.  పలు మున్సిపాలిటీల్లో చైర్మన్లతో పాటు కౌన్సిలర్లకు పెండింగ్ ఉన్నాయి.  తమ పాలకవర్గాలు ముగిసేలోపు బకాయిలు మొత్తం చెల్లించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని పాలకులు కోరుతున్నారు. 

గడువు పూర్తయ్యే లోపైనా ఇవ్వండి 

మూడు నెలల గౌరవ వేతనం పెండింగ్ ఉంది. ఐదేండ్లలో ఏనాడు సక్కగా ఇవ్వలేదు. వచ్చే నెలతో పాలకవర్గం గడువు పూర్తి కానుంది. ఆ లోపైనా  బకాయిలు చెల్లించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి. 


– భూక్యా శ్రీను, కౌన్సిలర్, కొత్తగూడెం మున్సిపాలిటీ-

సర్కార్ త్వరగా చెల్లించాలి  

నా పదవీకాలం ముగిసి నాలుగు నెలలు దాటింది. ఇంకా గౌరవ వేతనాలు రాలేదు. ఐదారు నెలల బకాయి రావాల్సి ఉంది. రాష్ట్ర సర్కార్ స్పందించి త్వరగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి.

 – పోషం నర్సింహరావు, మాజీ జెడ్పీటీసీ, మణుగూరు-