‘భూ భారతి’లో పరిష్కారాలు కనిపిస్తున్నాయి

తెలంగాణలో నీళ్లు నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ రాష్ట్రంలో గత ప్రభుత్వం ‘గెట్టు పంచాయతీ లేని తెలంగాణ నిర్మిస్తాం’ అని చెప్పి కొత్త రెవెన్యూ చట్టం 2020, ధరణి పోర్టల్ తెచ్చారు. కానీ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు ఉన్న భూ సమస్యలకు కొత్త సమస్యలు తోడయ్యాయి తప్ప 33 మాడ్యూల్స్​ తెచ్చినా పెద్దగా మార్పు ఏమీ కనిపించలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా భూముల అమ్మకాలు కొనుగోలు సంబంధించి రిజిస్ట్రేషన్, సక్సేషన్, మ్యూటేషన్, NALA కన్వర్షన్ లాంటివి మాత్రమే చెప్పుకోదగ్గవి.

2017 లో LRUP ( ల్యాండ్ రికార్డు అప్డేట్ ప్రోగ్రాం ) ద్వారా వీఆర్వో లను అవినీతిపరులు అనే ముద్ర వేసి వారిని తొలగించి ధరణి పోర్టల్ కాంట్రాక్టును స్వదేశీ ప్రభుత్వ రంగ సంస్థలైన NIC ( నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ) CGG ( సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ) వాటికి కాకుండా, హైదరాబాద్ లో  టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి స్వదేశీ ఐటీ సంస్థలకు కాకుండా, టెర్రాసిస్ లాంటి విదేశీ సంస్థలకు అప్పగించారు.

వ్యవసాయ భూముల సమగ్ర భూ సర్వే చేస్తా అని చెప్పి కేవలం రాజకీయ కక్ష సాధింపులలో భాగంగా దేవరయంజాల్లో  మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుత ఎంపీ  కోళ్ల ఫారాలు, ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫంక్షన్ హాల్ భూములు మాత్రమే సర్వే చేశారు. గ్రామకంఠం, ఆబాది భూముల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం 2020 లో తెచ్చిన స్వామిత్వ అనే పథకం కూడా అమలు చేయలేదు. పది లక్షల సాదాబైనామాలకు అవకాశం ఇచ్చి వాటిని పరిష్కరించడానికి అధికారులకు ఎలాంటి అవకాశం లేకుండా చట్టంలో రూల్స్ తయారు చేయకుండా నాలుగేళ్లు కాలయాపన చేసింది గత ప్రభుత్వం.

అన్యాక్రాంతం చేసిన అసైన్డ్​ భూములు

దేశానికి సేవచేసి పదవీ విరమణ పొందిన మాజీ సైనికులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వడానికి లేవన్న అసైన్డ్ భూములు గత ప్రభుత్వ నాయకులకు కబ్జాలు చేయడానికి మాత్రం దొరికాయి. హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి మూడు జిల్లాలలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఎవాక్యూ, వక్ఫ్, భూదాన్, ఎండోమెంట్, ఫారెస్ట్ లక్ష కోట్ల విలువైన భూములు కొల్లగొట్టబడ్డాయి. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ లో స్వయానా ఒక ధరణి పోర్టల్ కంప్యూటర్ ఆపరేటర్ తన కుటుంబం పేరు మీద ప్రభుత్వ భూమి 32 ఎకరాలు పట్టా చేసుకున్నాడు. ఇదే జిల్లా   కుడకుడలో బీఆర్ఎస్ నాయకులు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని జీవో 59 ద్వారా 60 మంది మీ సేవలో రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నారు. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో 250 ఎకరాల ప్రభుత్వ భూమి బీఆర్ఎస్ నాయకులు అధికారం ఉందని అక్రమంగా అసైన్ చేసుకున్నారని వార్త . ఇలా కొల్లగొట్టిన ప్రభుత్వ భూములు రాస్తే రామాయణం వింటే మహాభారతంలా ఉన్నాయి.

బంగాళాఖాతంలో వేస్తామన్న మాటను నిలుపుకున్నారు

మేము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన ప్రజా ప్రభుత్వం చెప్పినట్టే సంవత్సర కాలంలోనే 18 రాష్ట్రాల ఆర్ ఓ ఆర్ చట్టాలను అధ్యనయం చేసి భూభారతి 2024 చట్టం తెచ్చింది. భూభారతిలో గత ప్రభుత్వం విస్మరించిన వీఆర్వో లను గ్రామానికో ఉద్యోగిని తిరిగి నియమించి ప్రజలకు దూరమైన రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. అలాగే సర్వే డిపార్ట్మెంట్ ను బలోపేతం చేసే దిశగా మండలానికి ఇద్దరు సర్వేయర్ లు ఉండేలా నియామకాలు చేపట్టనున్నారు. ధరణి పోర్టల్ లోని 33 మాడ్యూల్స్​ను ఆరుకు కుదిస్తున్నారు. 11 కాలమ్స్ తో మళ్ళీ పహాని రాసి ఆ డేటానే  కంప్యూటర్ లో అప్డేట్ చేస్తారు. రిజిస్ట్రేషన్, సక్సెషన్, మ్యూటేషన్ యదావిధిగా కొనసాగిస్తారు. పోర్టల్ కాంట్రాక్టు NIC కి అప్పజెప్పారు. ఆటోలాక్ సిస్టం ఎత్తేసి ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ కు భూ సమస్యల పరిష్కారం కోసం అధికారాలు బదిలీ చేసారు. 

అన్ని సమస్యలకూ పరిష్కారాలు

గత ప్రభుత్వం తెచ్చిన రైట్ టు ప్రైవసీ ఎత్తేయడం మంచి పరిణామం. ప్రతి గ్రామానికి ఒక అకౌంట్ క్రియేట్ చేయడం, మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్టే భూమికి కూడా ప్రతి సర్వే నంబరుకు భూదార్ నంబర్ కేటాయించడం. సమగ్ర భూ సర్వే ( డిజిటల్ ల్యాండ్ సర్వే ) చేపట్టేలా చర్యలు. 10 లక్షల సాదా బై నామా సమస్యలకు పరిష్కారం. అసైన్డ్ భూములకు హక్కులు ఇవ్వడం. సెక్షన్ 22A ప్రోహిబిటెడ్ లిస్టులో ఉన్న 18.5 లక్షల ఎకరాల భూములకు పరిష్కారం. ప్రభుత్వ భూముల్లో జరిగిన అక్రమాలను ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా వెలికి తీసి అక్రమార్కులను శిక్షించేలా చర్యలు. ప్రజలు కోరుకున్న మార్పులతో ‘భూ భారతి’ని తేవడం ఆహ్వానించదగ్గ పరిణామం.

గెట్టు పంచాయితీలకు పరిష్కారం

భూముల అమ్మకం కొనుగోలు సందర్భంలో హద్దులతో కూడిన పక్కా సర్వే మ్యాప్ చేరిస్తేనే రిజిస్ట్రేషన్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనితో భూసమస్యలు చాలామేరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. గెట్టు పంచాయితీలూ తగ్గే  అవకాశం ఉంది. అలాగే దాని ద్వారా  క్రమేణా తెలంగాణ భూముల  కొలతల సర్వే పూర్తయ్యే అవకాశం ఉంటది. రిజిస్ట్రేషన్ పై అనుమానాలు ఉంటే అప్పీల్ అవకాశం కల్పిస్తున్నారు. గ్రామకంఠం, ఆబాది భూముల సర్వే చేసి పట్టా ఇచ్చే విధంగా ఈ చట్టంలో పొందుపరుస్తున్నారు. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సందర్భంగా విచారణ ( ఫీల్డ్ ఎంక్వయిరీ ) తప్పనిసరి. ఎంజాయ్మెంట్ సర్వే చేసి సబ్ డివిజన్ చేసేలా వీలు కల్పిస్తున్నారు.

-బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు