వచ్చి లొంగిపో.. నా సహనాన్ని పరీక్షించొద్దు : దేవెగౌడ వార్నింగ్​

వచ్చి లొంగిపో.. నా సహనాన్ని పరీక్షించొద్దు  : దేవెగౌడ వార్నింగ్​

బెంగళూరు:  మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వెంటనే ఇండియాకు వచ్చి లొంగిపోయి విచారణను ఎదుర్కోవాలని అతడి తాత, మాజీ ప్రధాని దేవెగౌడ హెచ్చరించారు. లేకుంటే తన ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఈ మేరకు గురువారం ఓ లేఖను ‘ఎక్స్’లో రిలీజ్​ చేశారు. ‘నువ్వు నా సహనాన్ని పరీక్షించొద్దు. ఎక్కడ ఉన్నా వెంటనే తిరిగి రావాలి. విచారణను ఎదుర్కోవాలి.’ అని పేర్కొన్నారు. ఈ లేఖ ద్వారా ప్రజ్వల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తాను అభ్యర్థించడం లేదని, హెచ్చరిస్తున్నానని దేవెగౌడ తెలిపారు. ఈ విషయంలో తనతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. అతడికి తన వాళ్లపై ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే దేశానికి తిరిగి రావాలని కోరారు. పార్టీ అభిమానుల నుంచి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని, అయినా వాళ్లను వారించలేమని చెప్పారు. ప్రజ్వల్ వ్యవహారంలో నిజాలు తేలేవరకు తాను వేచి చూస్తానన్నారు. ప్రజ్వల్ చేసిన పనులు తనకు తెలియదంటూ ఎవరినీ బుజ్జగించే ప్రయత్నం కూడా చేయనన్నారు. ప్రజ్వల్ విదేశాలకు వెళ్తున్న సంగతి కూడా తనకు ముందుగా తెలియదన్నారు. ఈ వ్యవహారంలో నిజాలు ఆ దేవుడికే తెలుసునన్నారు.