- తాండూరు వెళ్తున్న మాజీ మంత్రుల అడ్డగింత
- వికారాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
వికారాబాద్, వెలుగు: తాండూరు గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఫుడ్పాయిజన్జరిగి అస్వస్థతకు గురైన స్టూడెంట్లను పరామర్శించడానికి గురువారం బయలుదేరిన మాజీ మంత్రులు పి.సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్మెతుకు ఆనంద్, బీసీ కమిషన్మాజీ సభ్యుడు ఎన్.శుభప్రద్ పటేల్‌ను వికారాబాద్‌లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపైన బైఠాయించి నిరసన తెలిపారు.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని చెన్గోముల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి, సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. స్టూడెంట్లు బ్లడ్ శాంపిల్స్‌ను గుట్టుచప్పుడు కాకుండా ప్రహరీ గోడపై నుంచి ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. ఫుడ్‌పాయిజన్ కారణంగా ఆరుగురు స్టూడెంట్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, మరో 36 మంది అస్వస్థతతో హాస్టల్లోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హోదాలో ఉన్న తమను హాస్టల్‌కు ఎందుకు వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే తమ్ముడిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, కాంగ్రెస్ నేతలను ఎలా అనుమతిస్తున్నారని నిలదీశారు. విద్యా శాఖను తన దగ్గరే అంటిపెట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఏనాడూ విద్యా శాఖపై దృష్టి పెట్టలేదన్నారు. స్టూడెంట్లకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.