2024 ఎన్నికల్లో కేవలం 11సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఘోర ఓటమి చవిచూసిన మాజీ సీఎం జగన్ ఆ షాక్ నుండి బయటకు రాకముందే మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి సీనియర్ నాయకుడు శిద్దా రఘురామరావు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ కు ఆయన రాజీనామా లేఖను పంపారు. తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు శిద్దా రఘురామరావు.
2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా వ్యవహరించిన రఘురామారావు 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో దర్శి నుండి టికెట్ ఆశించిన శిద్దాకు జగన్ మొండి చెయ్యి చూపారు. తాను అడిగిన టికెట్ కేటాయించకపోవటంతో శిద్దా మౌనంగా ఉండిపోయారు. ఇక వైసీపీ ఓటమి తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసిన శిద్దా భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.