సిద్ధం సభకు బస్సు డ్రైవర్ గా పేర్ని నానీ

మాజీ మంత్రి పేర్ని నాని డ్రైవర్​ అవతారం ఎత్తాడు.  సీఎం జగన్​ సభకు అభిమానులు తరలివస్తున్న  బస్సును స్వయంగా పేర్నినాని డ్రైవింగ్​ చేశాడు.  ఇప్పుడు ఈ వార్త సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది. 

ఏలూరు జిల్లా దెందులూరులో  సిద్దం బహిరంగ సభకు  వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ కార్యకర్తలు అభిమానులు తరలివస్తున్నారు.  సిద్దం సభకు అభిమానులు  తరలి వస్తున్న  ఓ బస్సుకు మాజీ మంత్రి పేర్నినాని  డ్రైవింగ్​ చేశారు.   సీఎం జగన్మోహన్ రెడ్డితో‌పాటు ఈ వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.  ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుండి లక్షలాదిగా హాజరుకానున్నారు పార్టీ శ్రేణులు. రానున్న ఎన్నికల్లో వైసీపీ మరొకసారి అధికారం చేపట్టేందుకు కార్యకర్తలకు సిద్ధం సభ ద్వారా దిశ నిర్దేశం చేయనున్న సీఎం జగన్. 

దెందులూరులో జరిగే  సిద్దం మీటింగ్‌కు సంబంధించి వైఎస్‌ఆర్‌సి ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపి పివి మిధున్‌రెడ్డి వ్యక్తిగత పర్యవేక్షణలో పక్కా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే సీఎం ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య­చౌదరి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కంభం విజయరాజు తదితరులు భారీగా జనసమీకరణ చేశారు.  

110 ఎకరాల ప్రాంగణంలో..

 దాదాపు 50 నియోజకవర్గాల నుంచి లక్షకు పైగా ప్రజలు రానున్న క్రమంలో వారి వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి   ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఈ మేరకు సభాస్థలికి  సమీపంలోని దెందులూరు ఊరు ప్రారంభంలో 40 ఎకరాలు, అలాగే సభస్థలికి సమీపంలోని ఆటోనగర్‌ లో 25 ఎకరాలు,  మరో రెండు ప్రాంతాల్లో పార్కింగ్‌  ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సభను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా అంతా కృషిచేయాలని, అదేవిధంగా అభిప్రాయబేధాలు, ఇతర అంశాలన్నీ పక్కనపెట్టి అంతా భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని, తద్వారా ఎన్నికలకు తాము కూడా సిద్ధమని చెప్పడమే  లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.