చిలకలూరిపేటలో బీజేపీ... టీడీపీ.. .జనసేన నిర్వహించిన సభపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని బతిమిలాడి మరీ చంద్రబాబు పొత్తు కుదుర్చుకున్నారని ఆయన అన్నారు. లోపాయికారి ఒప్పందాలు ఎందుకోసం? ఎవరి కోసం? అని నిలదీశారు. దేశ ప్రధానే మైకు ముందు పావు గంట సేపు నిలుచున్నారంటే దేశ ప్రధానిని అవమానపరచినట్లే పేర్నినాని అన్నారు.మూడు పార్టీల సభ అట్టర్ ఫ్లాప్ అని ఆయన కామెంట్ చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఎందుకు కలిశాయో చెప్పాలని పేర్నినాని ప్రశ్నించారు.మీ ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా? ఇవ్వరా? అని ఎందుకు చెప్పలేదని పేర్నినాని అడిగారు. మూడు పార్టీల సభలో పోలవరం ప్రస్తావనే లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ను ఉంచుతారా? లేక అమ్ముతారా? ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు.అమరావతి, పోలవరం అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు.. ఇదేనా మీ నిబద్దత అని ప్రధాని మోదీని... పేర్నినానిప్రశ్నించారు .
వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మోదీ అంటున్నారు.. ఎవరైనా నమ్ముతారా? అని అన్నారు.మోదీ పక్కనున్న వాళ్లంతా గజదొంగలు. చంద్రబాబు కోసం పని చేసే వాళ్లు మీ పక్కనున్నారు. ఆలయాలను ధ్వంసం చేసిన వారి పక్కన మోదీ కూర్చోవడం ఏంటి? విభజన హామీలనే పట్టించుకోని మోదీ కొత్త హామీలిస్తారా? పగలు మోదీ, చీకట్లో రాహుల్ తో చేతులు కలిపే వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు ఇవ్వలేదు? గతంలో మోదీని చంద్రబాబు తిట్టారు. ఇప్పుడదే చంద్రబాబు.. మోదీని పొగిడారు. చంద్రబాబులో ఈ మార్పునకు కారణం ఏంటి? ఈ పొత్తులు, ఒప్పందాలు రాష్ట్రానికి అవసరం లేదు. గతంలో చంద్రబాబుకు ఓటు వేయొద్దని ఎన్టీఆర్ చెప్పారు.
ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి, షర్మిల అందరూ ఉంటారు. మోదీగారు.. మీరు చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబుతో సభలో పాల్గొనేటప్పుడు జాగ్రత్త. వెనక నుంచి వెన్నుపోటు పొడవకుండా చూసుకోండి” అని పేర్నినాని అన్నారు.2014లో తిరుపతి బాలాజీ సాక్షిగా మా కలయిక జరిగింది అని పవన్ చెప్పారు... మరి 2019లో ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు 2024లో తాజా లడ్డూలుగా మారిపోయాయా... అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "నాడు పవన్ కాకినాడలో పాచిపోయిన లడ్డూల వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఐదేళ్లు గడిచేసరికి ఆ లడ్డూలు చిలకలూరిపేట సభకు వచ్చేసరికి తాజా లడ్డూలు ఎలా అయ్యాయో రాష్ట్ర ప్రజలకు పవన్ కల్యాణ్ చెప్పాడా? ఆ లడ్డూలు ఎంత రుచిగా ఉన్నాయి? ఎందుకు రుచిగా ఉన్నాయి? అని ప్రజలకు ఎందుకని చెప్పలేదు?" అని నిలదీశారు.