త్వరలో పాలమూరు ప్రాజెక్టుల యాత్ర: కేటీఆర్

  • పాలమూరు బిడ్డకు ప్రాజెక్టుల పైన ప్రేమ లేదా? : కేటీఆర్ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్​ కింద తమ హయాంలో పూర్తి చేసిన రిజర్వాయర్లను త్వరలో పరిశీలిస్తామని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ తెలిపారు. 

ఈ ప్రాజెక్టు​పనులను తమ ప్రభుత్వమే 90 శాతం పూర్తి చేసిందని, మిగిలిన పనులు పూర్తిచేసి నీళ్లు ఇస్తే క్రెడిట్​ కేసీఆర్​కు  పోతుందన్న భావనతో రేవంత్​రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. 

ఈ వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు త్వరలో యాత్ర చేపడతామన్నారు. శనివారం నాగర్​కర్నూల్​ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటికి కేటీఆర్​వెళ్లారు. 

ఆయన భార్య శ్వేత ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించి.. లక్ష్మారెడ్డిని పరామర్శించారు. అనంతరం నేరెళ్లపల్లిలో మీడియాతో మాట్లాడారు. పాలమూరు ముద్దుబిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రేమ లేదా? అని కేటీఆర్  ప్రశ్నించారు. 

ప్రాజెక్టు దాదాపు పూర్తి కావచ్చినా.. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఎందుకు చొరవ చూపడం లేదో సమాధానం చెప్పాలన్నారు. పాలమూరులో దివ్యాంగులు ఇండ్ల కూల్చివేతను ఆయన తప్పుబట్టారు. ఆయన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.