కేటీఆర్​పై పెట్టింది తుపేల్ కేసు..ఇలాంటి వాటికి భయపడేటోళ్లం కాదు: హరీశ్​రావు

  • కేటీఆర్​ కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకొస్తరు
  • రేవంత్​ జైలుకు వెళ్లిన కేసుకు.. ఫార్ములా–ఈ రేస్​ కేసుకు పొంతనలేదని కామెంట్​

హైదరాబాద్, వెలుగు:కేటీఆర్​పై ఏసీబీ పెట్టింది తుపేల్​ కేసు అని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, వాటికి భయపడేటోళ్లం కాదని పేర్కొన్నారు.

 కేవలం కక్షసాధింపులో భాగంగానే కేసు పెట్టారని ఆరోపించారు. కేసు నుంచి కేటీఆర్​ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. ఎలాంటి తప్పు చేయలేదన్న ధైర్యం ఉంది కాబట్టే.. విచారణకు వెళ్తామంటున్నామని తెలిపారు. 

కోర్టు తీర్పుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, హైకోర్టు కేవలం విచారణ చేయాలని మాత్రమే చెప్పిందని అన్నారు. ఎంక్వైరీ మొదలు కాకముందే తప్పు జరిగిందంటూ కాంగ్రెస్​ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

మంగళవారం కేటీఆర్​ను నందినగర్​లోని నివాసంలో హరీశ్​రావు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్​ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లిన కేసుకు.. ఫార్ములా –ఈ రేస్​ కేసుకు పొంతన లేదని అన్నారు. 

డబ్బు కట్టలతో రేవంత్​ రెడ్డి కెమెరాల ముందు దొరికి, జైలుకు పోతే.. హైదరాబాద్​కు బ్రాండ్​ ఇమేజ్​ తెచ్చేందుకే కేటీఆర్​ ఫార్ములా– ఈ రేసును తీసుకొచ్చారని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానబోమని అన్నారు. 

కేసులు తమకేం కొత్త కాదని, సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకులపై పోరాడిన చరిత్ర తమదని పేర్కొన్నారు. ఆ సందర్భంలోనూ కేటీఆర్​ అరెస్టై వరంగల్​ జైలుకు వెళ్లారని గుర్తు చేశారు.  

అవినీతి జరిగిందని హైకోర్టు  చెప్పలే

ఫార్ములా –ఈ రేస్​లో అవినీతి జరిగిందని హైకోర్టు తీర్పులో ఎక్కడా చెప్పలేదని హరీశ్​రావు తెలిపారు.  ఇది అవినీతి ఉందని చెప్పి శిక్ష వేసిన తీర్పు కాదని పేర్కొన్నారు. అవినీతి జరిగిందని ప్రభుత్వం చెబుతుండడంతో విచారణ చేయాలని మాత్రమే కోర్టు చెప్పిందని తెలిపారు. 

ఎంక్వైరీకి సిద్ధమని కేటీఆర్​ ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా? లేదా? అన్నదానిపై తమ లీగల్​ టీమ్​ నిర్ణయిస్తుందని చెప్పారు. హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత తదుపరి కార్యాచరణ చేపడతామని అన్నారు. 

ఫార్ములా –ఈ రేస్​లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని పేర్కొన్నారు. ఏసీబీ ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా 9వ తేదీన కేటీఆర్​ విచారణకు వెళ్తారని చెప్పారు.2 రోజుల క్రితం కూడా ఎంక్వైరీకి వెళ్లారని, 45 నిమిషాలు ఓపిగ్గా వేచి చూశారని తెలిపారు. 

కోర్టులపై తమకు పూర్తి నమ్మకం ఉందని, సీఎం రేవంత్, ఆయన అధికారులపైనే లేదని అన్నారు. రైతు భరోసాను కుదించడంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నదని, అటెన్షన్​ డైవర్షన్​ కోసమే రేవంత్​ రెడ్డి తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. 

భవిష్యత్తులోనూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కేసులు మరిన్ని పెట్టే అవకాశం ఉందని అన్నారు. గ్రీన్​ కోకు రూపాయి లబ్ధి చేయనప్పుడు వాళ్లు తమకు డబ్బులు తిరిగి ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు.

 ఫార్ములా –ఈ రేసు నిర్వహణలో ఆ సంస్థ భారీగా నష్టపోయిందని, అలాంటి పరిస్థితుల్లో వాళ్ల నుంచి డబ్బులు వచ్చాయనడం అర్థరహితమని వ్యాఖ్యానించారు.