చంద్రబాబు చేసిన తప్పే పోలవరానికి శాపం అయ్యింది.. అంబటి రాంబాబు

ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పోలవరంపై రచ్చ జరుగుతోంది. నాలుగువసారి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు సోమవారం పోలవరాన్ని సందర్శించి ప్రాజెక్టును పరిశీలించారు. సందర్శన అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేసిందని, ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ క్షమించరాని తప్పు చేశారని మండిపడ్డారు.పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టి నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తీ చేస్తామని అన్నారు.

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలవరంపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అంబటి చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు జగన్ పై, తమపై బురదచల్లటానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టినట్లు ఉందని, పోలవరం విషయంలో తమ హయాంలో ఎలాంటి తప్పు జరగకపోగా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టుకు ఒక షేప్ తీసుకొచ్చామని అన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం చేశారని, ఆ తప్పే పోలవరానికి శాపంగా మారిందని అన్నారు.

కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండానే డయాఫ్రామ్ వాల్ కట్టడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పు అని, ఆ తప్పు వల్లే ప్రాజెక్టుకు ఈ దుస్థితి పట్టిందని మండిపడ్డారు. తప్పంతా తన హయాంలో చేసి జగన్ మీద, తమ పార్టీ మీద బురద చల్లటం కరెక్ట్ కాదని అన్నారు. ప్రతి సోమవారం పోలవరాన్ని విజిట్ చేస్తానంటున్న చంద్రబాబు అక్కడ జరిగిన తప్పులేంటో తెలుసుకుంటే బాగుంటుందని, అనవసరంగా తమపై బురదజల్లితే ఏ ప్రయోజనం ఉండదని అన్నారు.