పని చేయకపోతే కాంగ్రెస్​ను కూడా నిలదీస్తాం: ​ ఆకునూరి మురళి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: దేశానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదకరమని, బీజేపీకి అస్సలే ఓటెయ్యొద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక, జాగో తెలంగాణ ఆధ్వర్యంలో ఓట్లరను చైతన్యపర్చేందుకు బస్సు యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా నాగర్​కర్నూల్​లో ఆయన మాట్లాడారు. ఈ పదేండ్లలో మోదీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. 60 శాతం ఉన్న రైతుల సంక్షేమానికి అసలే పాటుపడలేదన్నారు. 

ఆదానీ, అంబానీలను తప్ప పేదలను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. బీసీల వర్గీకరణ చేయలేదని, రిజర్వేషన్లు మార్చే ఆలోచనలో ఉన్నారని, అలాంటి వారికి ఓట్లు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగానికి, బహుజనులవాదాన్ని మోసం చేసిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయకపోతే, ఆ పార్టీని కూడా నిలదీస్తామన్నారు. ప్రొఫెసర్ జానయ్య, రాందాస్, జగదీశ్, లక్ష్మీనారాయణ, మహేశ్, గోవర్ధన్, పద్మజ పాల్గొన్నారు.