కాంగ్రెస్ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి...

ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో టికెట్ దక్కిన అభ్యర్థులంతా ప్రచారాన్ని ప్రారంభించి జనంలోకి వెళ్తుండగా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ ఫిరాయింపులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడప జిల్లా బద్వేలులో ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కృపారాణి. ఆమె కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల.

2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి ఎంపీ సీటు ఆశించిన కృపారాణికి టికెట్ దక్కలేదు. అయితే, ఈ ఎన్నికల్లో అయినా తనకు టికెట్ దక్కుతుందని ఆశించిన కృపారాణి టికెట్ దక్కకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. మరి, తిరిగి సొంత గూటికి చేరిన కృపారాణికి ఈ ఎన్నికల్లో అయినా ఆశించిన సీటు దక్కుతుందా లేదా అన్నది వేచి చూడాలి.