మహా కుంభమేళాకు సర్వం సిద్ధం.. అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ కెమెరాలతో నిఘా

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‎లోని ప్రయాగ్ రాజ్‎లో వచ్చే నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహా కుంభమేళాకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కుంభమేళా చరిత్రలో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగించనున్నారు. ఈ డ్రోన్లు వంద మీటర్ల లోతు వరకు వెళ్లి భద్రతను పర్యవేక్షించడంలో సాయం చేస్తాయి. అలాగే, 50 వేల మందితో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కుంభమేళా జరిగే ప్రాంతంలో 92 రోడ్లను శరవేగంగా బ్యూటిఫై చేయడంతో పాటు అవసరమైన చోట రిపేర్లు కూడా చేస్తున్నారు. 

కుంభమేళా ఏర్పాట్లకు సంబంధించి యూపీ సాంస్కృతిక శాఖ ఆదివారం తెలిపింది. మేళాలో 30 పాంటూన్ (నీటిపై తేలియాడే) బ్రిడ్జిలు కడుతున్నామని అధికారులు చెప్పారు. భక్తుల కోసం హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాషలతో కూడిన 800 సూచిక బోర్డులను కుంభ్  నగర్‎లో పెడుతున్నామని చెప్పారు. ‘‘కుంభమేళాను గ్రాండ్  సక్సెస్ చేసేందుకు యోగి సర్కారు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. 45 రోజుల పాటు జరిగే బృహత్ కార్యక్రమానికి దాదాపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. 

భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. కుంభమేళా చరిత్రలో తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగిస్తున్నాం. 2700 ఏఐ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తాం. ఎంట్రీ పాయింట్ల వద్ద ఫేషియల్ రికగ్నిషన్, 56 మంది సైబర్ వారియర్లతో కూడిన బృందం ఆన్ లైన్‎లో భద్రతా వ్యవహారాలను చూస్తుంది. పోలీసు స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్‎లు, మెరుగైన పారిశుధ్యం కోసం మొబైల్ టాయిలెట్లు అందుబాటులో పెడతాం” అని అధికారులు వివరించారు.