ఏటూరునాగారంలో భారీ ఎన్​కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి

  • మృతుల్లో కీలక నేత భద్రు సహా దళ సభ్యులు 
  • రెండు ఏకే 47, ఇతర ఆయుధాలు స్వాధీనం 
  • అన్నంలో విషం పెట్టి చంపారని పౌర హక్కుల సంఘం నేతల ఆరోపణ 
  • 33 ఏండ్ల కింద ఇదే చల్పాక అటవీ ప్రాంతంలో ఏడుగురు పోలీసులను చంపిన మావోయిస్టులు 

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/ఏటూరు నాగారం, వెలుగు : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారు జామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. వీరిలో మావోయిస్టు కీలక నేత భద్రు సహా అతని దళం సభ్యులు అందరూ ఉన్నారు. ఎన్​కౌంటర్ వివరాలను ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌‌‌‌ శబరీశ్‌‌ మీడియాకు వెల్లడించారు. పీఎల్‌‌‌‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఏటూరునాగారం అటవీ ప్రాంతంలో భద్రు దళం సంచరిస్తున్నదన్న పక్కా సమాచారంతో గ్రేహౌండ్స్‌‌‌‌, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టిందని ఆయన తెలిపారు. 

‘‘ఆదివారం తెల్లవారుజామున 5:18 గంటల సమయంలో చల్పాక అటవీ ప్రాంతంలోని పోలకమ్మ గుత్తికోయ గుంపు సమీపంలో 12 నుంచి 13 మంది మావోయిస్టులు పోలీసులకు ఎదురుపడ్డారు. ముందుగా మావోయిస్టులే కాల్పులు జరిపారు. లొంగిపొమ్మని పదే పదే హెచ్చరించినా వినకుండా కాల్పులు కొనసాగించారు. దీంతో పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఇల్లందు, నర్సంపేట ఏరియా కార్యదర్శి కుర్సం మంగు(35) అలియాస్ భద్రు అలియాస్​పాపన్నతో పాటు మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు, మహదేవ్‌‌‌‌పూర్‌‌, ఏటూరునాగారం‌‌ ఏరియా కార్యదర్శి ఏగోళపు మల్లయ్య(45) అలియాస్ కోటి ఉన్నారు. 

అలాగే దళ సభ్యులు చత్తీస్ గఢ్ కు చెందిన ముస్సాకి దేవల్‌‌(22)‌‌ అలియాస్​కరుణాకర్, ముస్సాకి జమున (23) కూడా చనిపోయారు. మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది” అని ఎస్పీ వివరించారు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47, జీ-3, ఇన్సాస్‌‌‌‌, 303 రైఫిల్, సింగిల్‌‌‌‌ షాట్‌‌‌‌, తపంచా ఒక్కొక్కటి చొప్పున, కొన్ని కిట్ బ్యాగ్ లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తప్పించుకుని పారిపోయిన మిగతా మావోయిస్టులు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారకు. వాళ్లకు పునరావాసం కల్పించి అండగా ఉంటామని చెప్పారు. 

ఉదయం 11 తర్వాత కూడా కాల్పులు.. 

చల్పాక వద్ద  ఉదయం 11 గంటల తర్వాత కూడా కాల్పుల శబ్దం వినిపించింది. ఎన్‌‌‌‌కౌంటర్ విషయం తెలియగానే ఆదివారం ఉదయం మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా 4 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు ఆపేశారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతున్నదని, అక్కడికి వెళ్లొద్దని చెప్పారు. అప్పుడే బైక్ ‌‌పై ములుగు ఎస్పీ శబరీశ్‌‌ అక్కడికి వచ్చారు. ఆయన మీడియాతో ఏమీ మాట్లాడకుండానే అడవిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల టైమ్​ లో ప్రతి ఐదు, పది నిమిషాల తేడాతో ఆరు రౌండ్ల తుపాకీ శబ్దాలు వినిపించాయి. దీంతో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. 

33 ఏండ్ల కింద ఇదే ప్రాంతంలో..  

33 ఏండ్ల కింద ఇదే చల్పాక అటవీ ప్రాంతంలో ఏడుగురు పోలీసులను మావోయిస్టులు చంపారు. 1991 జూన్ 21న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు భారీ మందుపాతర పేల్చారు. చల్పాక పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్సులో సిరా పోసి, దానిపై పోలీసులకు సమాచారం అందించి, వారిని రప్పించి మరీ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇందులో ఏటూరునాగారం సీఐ సంతోష్ కుమార్, ఎస్సై కిషోర్ కుమార్ సహా ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.  

సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : పౌర హక్కుల సంఘం 

ఈ ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌పై అనేక అనుమానాలు ఉన్నాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్‌‌‌‌.నారాయణరావు అన్నారు. మావోయిస్టులకు అన్నంలో విషం పెట్టి చంపేశారని ఆరోపించారు. వాళ్ల మృతదేహాలకు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  

భద్రు మృతితో ఎదురుదెబ్బ.. 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కీలక నేత భద్రు మృతితో మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్​గఢ్ లోని బీజాపూర్ జిల్లాకు చెందిన భద్రు మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. చర్ల ప్రాంతం నుంచి కిన్నెరసాని అభయారణ్యం మీదుగా గుండాల, ఉమ్మడి వరంగల్​జిల్లాలోని గంగారం, నర్సంపేట ప్రాంతాల వరకు ఆయనకు మంచి పట్టుంది. ఇల్లందు, గుండాల, నర్సంపేట, కొత్తగూడ, మేడారం ప్రాంతాల్లోని గిరిజనులతో మంచి సంబంధాలు ఉన్నాయి. పలు ఎన్​కౌంటర్ల నుంచి భద్రు తప్పించుకున్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు పలుమార్లు ప్లాన్​చేసి, ఫెయిల్ అయ్యారు.