ముడాతో అభివృద్ధి పరుగులు

  • మెదక్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ 
  • రెండు మున్సిపాలిటీలు, 289 రెవెన్యూ గ్రామాలతో ముడా  ఏర్పాటు

మెదక్, వెలుగు: మెదక్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) ఏర్పాటు కానుండటంతో జిల్లా అభివృద్ధి బాటలో పయనించనుంది. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు 289 రెవెన్యూ గ్రామాలను కలిపి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలు హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో ఉండటం వల్ల ఆ రెండు పట్టణాలను మినహాయించారు. ఇటీవలే ముడాకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కాగా..  త్వరలోనే అథారిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మొదలు కానుంది. 

గత ప్రభుత్వం మాటలకే పరిమితం 

మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ మున్సిపాలిటీ, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం మెదక్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  ప్రకటించారు. పదేండ్ల పదవీకాలం ముగిసిపోయినా అథారిటీ ఏర్పాటు మాటలకే పరిమితమైంది. పదేళ్ల బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ పాలనలో జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో రైతు బజార్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠ ధామం, పార్క్, మినీ ట్యాంక్ బండ్,  బైపాస్ రోడ్డు లాంటి పనులేవీ చేపట్టకపోవడం గమనార్హం.

ప్రణాళికబద్ధమైన డెవలప్‌మెంట్ 

అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడం వల్ల మున్సిపల్ పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం ప్రణాళిక బద్ధమైన అభివృద్ధికి అవకాశం ఉంటుంది. మాస్టర్ ప్లాన్ తయారుచేసి ఆయా ప్రాంతాల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరిచే అవకాశం ఉంది.  

కలెక్టర్ చైర్మన్ గా.. 

మెదక్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మెన్‌గా జిల్లా కలెక్టర్ రాహుల్‌ రాజ్, వైస్‌ చైర్మన్‌ గా అడిషనల్ కలెక్టర్‌‌ వ్యవహరించనున్నారు. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,  డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మెంబర్లుగా ఉంటారు. 

మెదక్‌కు మహర్ధశ

గత బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అది మాటలకే పరిమితమైంది.  కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకుండానే ముడా ఏర్పాటు చేయడం హర్షణీయం. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ చొరవ, మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ కృషితో ఇది సాధ్యమైంది. - హఫీజొద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ప్రెసిడెంట్