బీ అలర్ట్.. ఎవరు అడిగినా ఈపీఎఫ్ఓ వివరాలు ఇవ్వొద్దు

బీ అలర్ట్.. ఎవరు అడిగినా ఈపీఎఫ్ఓ వివరాలు ఇవ్వొద్దు

న్యూఢిల్లీ: సైబర్ క్రిమినల్స్ తమ సబ్‌‌‌‌స్క్రయిబర్ల ఖాతా వివరాలతో మోసాలు చేస్తున్నారని తెలియడంతో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) అలెర్టయింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఈపీఎఫ్, బ్యాంకు ఖాతాలు లేదా ఓటీపీ నంబర్లను  ఫోన్ లేదా ఆన్‌‌లైన్‌‌లో వెల్లడించకూడదని చందాదారులను హెచ్చరించింది. కొందరు సైబర్ క్రిమినల్స్ ఓటీపీ స్కామ్‌‌లు చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ ఫ్రాడ్ అలెర్ట్ నోటీసును జారీ చేసింది.  ఈపీఎఫ్ సబ్‌‌స్క్రయిబర్లు తమ ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా యూఏఎన్ నంబర్ల వంటి వివరాలను ఎవరు అడిగినా ఇవ్వకూడదు. లేకపోతే వారి ఖాతాలోని డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది.  ‘‘మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్ లేదా సోషల్ మీడియా మొదలైన వాటి ద్వారా ఈపీఎఫ్ ఎప్పుడూ డబ్బు అడగదు. మీకు ఏవైనా సేవలు కావాలంటే నేరుగా ఆఫీసులకు రావాలి. ఎవరైనా ఓటీపీ వంటి వివరాలు అడిగితే రెస్పాండ్ కావొద్దు. ఇలాంటి సమాచారం ఇస్తే మోసానికి దారితీయవచ్చు” అని హెచ్చరించింది. మోసాలు ఎలా జరుగుతాయో వివరిస్తూ ట్విట్టర్‌‌లో ఒక గ్రాఫ్‌‌ ప్రెజెంటేషన్‌‌ను కూడా అప్‌‌లోడ్‌‌ చేసింది.  ఏవైనా ప్రశ్నలు ఉన్నా, అనుమానాస్పద కాల్స్/మెసేజ్‌‌లు వచ్చినా,  ఇతర సమస్యలు ఉన్నా ఈపీఎఫ్ఓ www.epfindia.gov.in ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి.

డిజిలాకర్‌‌ వాడాలి..

ఈపీఎఫ్ఓ సబ్‌‌స్క్రయిబర్లు తమ డాక్యుమెంట్‌‌లను షేరింగ్  వెరిఫికేషన్ కోసం  ప్రభుత్వ ప్లాట్‌‌ఫారమ్ అయిన డిజిలాకర్‌‌లో కూడా సేవ్ చేసుకోవాలి. ఇది సెక్యూర్‌‌ క్లౌడ్‌‌ ఆధారిత ప్లాట్‌‌ఫారమ్‌‌ కాబట్టి డాక్యుమెంట్లకు భద్రత ఉంటుంది. డిజిలాకర్ సేవలను ఉపయోగించడానికి అండ్రాయిడ్‌‌ లేదా ఐఓఎస్‌‌లో యాప్‌‌ డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవాలి. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యూఏఎన్ కార్డులు, పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు,  స్కీమ్ సర్టిఫికెట్ల వంటి ఈపీఎఫ్ఓ సేవలు అన్నీ డిజిలాకర్లో అందుబాటులో ఉంటాయి. 2020-–21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌‌ చందాదారులు 8.5 శాతం వడ్డీ రేటును పొందుతారని ఈపీఎఫ్‌‌ఓకు సెంట్రల్‌‌ బోర్డ్‌‌ ఆఫ్‌‌ ట్రస్టీస్‌‌ (సీబీటీ) ప్రకటించింది. ఈ నిర్ణయం ఐదు కోట్ల మంది ఈపీఎఫ్ఓ కస్టమర్లకు మేలు చేస్తుంది.  ఈపీఎఫ్‌‌ఓ ప్రావిడెంట్‌‌ ఫండ్స్‌‌, పెన్షన్లు, జీవిత బీమా వంటి ఆర్థిక సేవలు అందిస్తుంది.