ఇంటర్​ సెకండియర్​లోనూ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్

  • గతేడాది ఫస్టియర్​లో మొదలైన ప్రాక్టికల్స్ సిస్టమ్  
  • ఏటా 20 మార్కులు ఉండడంతో ప్రయారిటీ 
  • స్టూడెంట్లలో స్కిల్స్ పెంచేందుకు ఇంటర్ బోర్డు ప్రయోగం సక్సెస్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ స్టూడెంట్లలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ పెంచేందుకు ఇంటర్ బోర్డు తీసుకొచ్చిన ‘ప్రాక్టికల్స్’ విధానం మంచి ఫలితాలు ఇస్తున్నది.గతేడాది ఫస్టియర్​లో అమలు చేసిన ఇంటర్ బోర్డు.. ఈ ఏడాది సెకండియర్​లోనూ దీనిని కొనసాగించనున్నది. ప్రతి ఏటా 20 మార్కులు  కూడా ఉండడంతో లెక్చరర్లతో పాటు స్టూడెంట్లు కూడా వీటికి ప్రయారిటీ ఇస్తున్నారు. స్కూల్ లెవెల్ లో తెలుగు మీడియం నుంచి కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని లెక్చరర్లు చెప్తున్నారు. రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఇంటర్‌‌‌‌‌‌‌‌ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. సుమారు తొమ్మిదిన్నర లక్షల మంది అటెండ్ కానున్నారు. ఇప్పటివరకు సైన్స్, ఒకేషనల్ స్టూడెంట్లకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. కానీ, 2023–24 విద్యాసంవత్సరం నుంచి దేశంలోనే తొలిసారిగా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ విధానాన్ని ఇంటర్ బోర్డు తీసుకొచ్చింది. గతేడాది ఫస్టియర్​ విద్యార్థులకు అమలు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి సెకండియర్ విద్యార్థులకూ నిర్వహించనున్నది. జనవరి 31న ఫస్టియర్ స్టూడెంట్లకు.. ఫిబ్రవరి 1న సెకండియర్ స్టూడెంట్లకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు షెడ్యూల్​ కూడా విడుదల చేసింది. ప్రాక్టికల్స్ కు 20 మార్కులు.. 80 మార్కులు రాతపరీక్ష ద్వారా కేటాయిస్తారు. అయితే, ప్రతి స్టూడెంట్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అటెండ్ కావాల్సి ఉంది. ఇంగ్లీష్ ఇంటర్నేషల్ లాంగ్వేజ్ కావడంతో.. ఆ భాషలో స్టూడెంట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్టు ఇంటర్ బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ఫస్టియర్​లో మంచి ఫలితాలు ఇచ్చిందని, సెకండియర్​లోనూ అదే రిపిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రాక్టికల్స్​లో నాలుగు మాడ్యూల్స్.. 

ఫస్టియర్​తో పాటు సెకండియర్​ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్​ లోనూ నాలుగు మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కో మడ్యూల్ కు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 16 మార్కులు, ప్రాక్టికల్ రికార్డు బుక్ కు మరో నాలుగు మార్కులు ఉంటాయి. ఫస్టియర్​లో కంప్యూనికేటీవ్ ఫంక్షన్, జస్ట్ ఏ మినిట్, రోల్ ప్లే, లిజనింగ్ కాంప్రహెన్సివ్ తదితర విభాగాలుగా మాడ్యూల్స్ ఉన్నాయి. దీని ప్రకారం జనరల్ గా పలకరింపులు, ఏదైనా ఒక సబ్జెక్టుపై ఒక నిమిషం మాట్లాడటం, రెండు పాత్రల మధ్య సంభాషణలు, ఒక అంశాన్ని వినిపించి దాంట్లోంచి క్వశ్చన్లు అడగడం ఉంటాయి. సెకండియర్​లో డిస్ క్రైబింగ్ ఏ టాపిక్, ప్రజెంటేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్, లిజనింగ్ కాంప్రహెన్సివ్ తదితర మాడ్యూల్స్ ఉండగా.. ఏదైనా ఒక టాపిక్ వివరించడం, బోర్డు/ స్ర్కీన్ పై ఎక్స్ ప్లెయిన్ చేయడం, ఒక అంశంపై నలుగురైదుగురు స్టూడెంట్లతో చర్చలు చేయించడం వంటివి ఉంటాయి.