దాడులు చేస్తే డ్యూటీలు చెయ్యడం కష్టం : ఇంజినీరింగ్ అసోసియేషన్ల ప్రతినిధులు

హైదరాబాద్, వెలుగు : విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం హేయమైన చర్య అని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అసోసియేషన్ల ప్రతినిధులు డిమాండ్ చేశారు. లగచర్ల ఘటన మరువకముందే.. అబ్దుల్లాపూర్​మెట్​లో ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులపై నోవా మెడికల్ కాలేజీ యాజమన్యం దాడి చేసిందని తెలిపారు.

హైదరాబాద్​ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏఎస్​ఎన్​ రెడ్డి, చక్రధర్​, తెలంగాణ ఇరిగేషన్​ గ్రాడ్యుయేషన్​ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్​, గోపాలకృష్ణ, తెలంగాణ అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, నాగరాజు, ఇరిగేషన్ డిప్లొమా ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్ రెడ్డి, అనిల్​కుమార్ లు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాఫర్​గూడ చెరువు బఫర్ జోన్​లో నోవా మెడికల్ కాలేజీని అక్రమంగా నిర్మించారని, రెవెన్యూ అధికారులతో కలిసి ఇరిగేషన్ ఏఈఈ వంశీధర్​అక్రమ నిర్మాణాలను తొలగించారని అన్నారు.

డ్యూటీ చేస్తున్న ఏఈఈ, రెవెన్యూ అధికారులపై నోవా మెడికల్ కాలేజీ బౌన్సర్లు దాడి చేశారని, అది నీచమైన చర్య అని మండిపడ్డారు. ఇలాగే దాడులు కొనసాగితే డ్యూటీలు చేయడం కష్టమవుతుందని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్​చేయాలని వారు డిమాండ్​ చేశారు. లేదంటే పెన్​డౌన్ చేసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.