ENG vs AUS: ఒకే ఓవర్‌లో 30 పరుగులు.. ఐపీఎల్ స్టార్ తాట తీసిన ట్రావిస్ హెడ్

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ భీకర ఫామ్ కనబరుస్తున్నాడు. ఐపీఎల్, మేజర్ క్రికెట్ లీగ్, టీ20 ప్రపంచ కప్, స్కాట్లాండ్‌తో టీ20 సిరీస్.. ఇలా టోర్నీ ఏదైనా జట్టు ఏదైనా ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాడు. 10 ఓవర్లలో చేయాల్సిన పరుగులను పవర్‌ప్లేలోనే రాబట్టేస్తున్నాడు. బుధవారం(సెప్టెంబర్ 12) ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు.

బెండైపోయిన ఐపీఎల్ స్టార్

ఈ మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లు ఆచి తూచి ఆడిన హెడ్ అనంతరం శివాలెత్తిపోయాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో ఓవర్‌లో మూడు ఫోర్లు బాదాడు. అనంతరం సామ్ కర్రన్ వేసిన ఐదో ఓవర్ లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. 4, 4, 6, 6, 6, 4.. ఇలా ఆరు బంతులను బౌండరీకి తరలించాడు. మొత్తంగా 23 బంతుకు ఎదుర్కొన్న హెడ్ 8 ఫోర్లు, 4 సిక్స్‍ల సాయంతో  59 పరుగులు చేశాడు. అతని విధ్వంసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఆసీస్‌దే తొలి విజయం 

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. తొలి టీ20లో 28 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 19.3 ఓవర్లలో 179 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. అనంతరం ఛేదనలో ఆతిథ్య ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 13న కార్డిఫ్ వేదికగా రెండో టీ20 జరగనుంది.