ఉద్యోగుల సమస్యలుపరిష్కరించండి

  • మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నంను కోరిన ఉద్యోగులు జేఏసీ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లను ఉద్యోగుల జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస రావు కోరారు. గురువారం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రులను కలిసి ఉద్యోగుల సమస్యల పై వినతిపత్రం అందచేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఉద్యోగుల జేఏసీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు జగదీశ్వర్, శ్రీనివాసరావు  తెలిపారు. మంత్రులను కలిసిన వారిలో టీజీవో, టీఎన్జీవో జనరల్ సెక్రటరీలు ముజీబ్, సత్యనారాయణతో పాటు పలువురు నేతలు ఉన్నారు.