ఎమర్జెన్సీ.. మాయని మచ్చ

ఎమర్జెన్సీ.. మాయని మచ్చ

మ్యూనిచ్ : ఇండియా చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మాయని మచ్చలా మిగిలిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జీ7 దేశాల సమిట్​లో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీలోని మ్యూనిచ్​కు చేరుకున్న ఆయన అక్కడి ఇండియన్ సంతతి ప్రజలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ‘‘ఈ రోజు జూన్ 26. 47 ఏండ్ల క్రితం 1975లో.. ప్రతి ఇండియన్ డీఎన్ఏలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కూలదోసి, ఎమర్జెన్సీని అమల్లోకి తెచ్చిన రోజు ఇది. అతి గొప్పదైన ఇండియా ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఒక నల్లని మచ్చలా మిగిలిపోయింది. కానీ ఈ రోజు ఇండియా ప్రజాస్వామ్యానికి తల్లివంటిదని మనం గర్వంగా చెప్పుకోగలిగే స్థితికి ఎదిగాం” అని ప్రధాని అన్నారు. ‘‘ఇండియాలో పేదలు ఇప్పుడు రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్ మెంట్ పొందుతున్నారు. ఇండియన్లందరికీ టీకాలు వేయాలంటే పది, పదిహేనేండ్లు పడుతుందని చాలా మంది అన్నారు. కానీ ఇప్పటికే దేశంలోని పెద్దవాళ్లలో 90 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. స్టార్టప్ ల ఏర్పాటులో ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశంగా అవతరించిందని, మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో రెండో స్థానానికి చేరుకుందన్నారు. ఇండియా దాని కలలను నెరవేర్చుకునేందుకు సిద్ధమైంది” అని ప్రధాని వివరించారు.  

మోడీకి గ్రాండ్​ గా వెల్ కం 

జర్మనీ బవేరియా రాష్ట్రంలోని ష్లస్ ఎల్మావూ హోటల్ లో 26, 27 తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగే జీ7 సదస్సులో గెస్ట్ కంట్రీ హెడ్ హోదాలో మోడీ పాల్గొంటున్నారు. ఈ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరయ్యేందుకు ఆదివారం మ్యూనిచ్​కు చేరుకున్న మోడీకి అక్కడి ఇండియన్ సంతతి ప్రజలు గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. అలాగే బవేరియా రాష్ట్రం తరఫున బవేరియన్ బ్యాండ్ తో అధికారికంగా కూడా ఆయనకు ఘన స్వాగతం లభించింది. జీ7 సమిట్ లో ఇంధనం, ఆహార భద్రత, టెర్రరిజం, పర్యావరణం, ప్రజాస్వామ్యం వంటి అంశాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై సభ్యదేశాల అధినేతలు చర్చించనున్నారు. 

రష్యన్ గోల్డ్ ను నిషేధిస్తాం: బైడెన్

ఉక్రెయిన్​పై యుద్ధం చేస్తున్న రష్యాను నిలువరించేందుకు ఆ దేశం నుంచి బంగారం దిగుమతులనూ నిషేధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. జీ7 సమిట్​లో ఈ మేరకు సభ్య దేశాలు రష్యన్ గోల్డ్ దిగుమతుల నిషేధంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, రష్యన్ గోల్డ్ దిగుమతులపై నిషేధం అంశంపై సమిట్ మూడోరోజున మంగళవారం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.