రోడ్ ట్రిప్ అనేది ఒక్కొక్కరికీ ఒక్కో ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. మన దేశంలో రోడ్డు ట్రిప్‌కి వెళ్లాలే కానీ ఎన్నో అద్భుతాలను కళ్లారా చూడొచ్చు. ఆనందాలను మనసునిండా నింపుకోవచ్చు. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా ఏ రాష్ట్రంలోకి అడుగుపెట్టినా అందమైన ప్రకృతి పలకరింపు ఉంటుంది.
లోయలు, పర్వతాలు, దట్టమైన అడవులు, సముద్రాలు... ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అద్భుతాలను కళ్ల ముందు నిలబెడుతుంది. అందుకే హైవే జర్నీ ప్లాన్ చేయండి, జాతీయ, రాష్ట్ర హైవే ట్రిప్‌లో సహజమైన అందాలను పలకరిస్తూ ప్రయాణం కానిచ్చేయండి. వీకెండ్స్‌లో షార్ట్ ట్రిప్‌కి వెళ్లాలన్నా, లాంగ్ అడ్వెంచర్ జర్నీ చేయాలన్నా మంచి ఎక్స్‌పీరియెన్స్ దొరుకుతుంది.
అందమైన హైవే రోడ్లలో కొన్ని ఇవి...
రామేశ్వరం నుంచి పంబన్ బ్రిడ్జి : ఇండియాలోనే అద్భుతమైన హైవే ఇది. రామేశ్వరం నుంచి పంబన్ బ్రిడ్జి జర్నీ షార్ట్ రూట్. కానీ ఈ జర్నీ చేసిన వాళ్లు జీవితంలో మర్చిపోలేరు. హిందూ మహాసముద్రం మీద డ్రైవ్ చేస్తుంటే ఆ నీళ్లు చూసే కళ్లను అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. దాని పక్కగా వెళ్లే రైల్వే ట్రాక్ చూస్తుంటే గమ్మత్తయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ ట్రిప్ కచ్చితంగా మర్చిపోలేని అనుభూతులను ఇస్తుంది. ఈ బ్రిడ్జి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. దానిపక్కగా వెళ్తున్న రైల్వేలైన్‌లో ఒక అందం కనిపిస్తుంది. బ్రిడ్జి పొడవు 2.2 కిలోమీటర్లు. రామేశ్వరం నుంచి పంబన్ బ్రిడ్జి ప్రయాణం13.4 కిలోమీటర్లు.
ముంబయి నుంచి గోవా: ముంబయి నుంచి గోవా రోడ్డు జర్నీ కనులకు విందు చేస్తుంది. కొండలు, లోయలు, జలపాతాలను చూస్తూ సముద్రం పక్కగా సాగే జర్నీ ఇది. కొల్హాపూర్‌లో కొంచెంసేపు ఆగి... అక్కడినుంచి పార్టీ కాపిటల్ గోవా వైపుకు జర్నీ మొదలుపెట్టొచ్చు. ఈ మొత్తం ప్రయాణం 590 కిలోమీటర్లు.
మనాలి నుంచి లెహ్: అడ్వెంచర్ ఇష్టపడేవాళ్లు మనాలి నుంచి లెహ్ జర్నీని అంతే అడ్వెంచరస్‌గా ఎంజాయ్ చేయడం ఖాయం. పర్వతాలు శ్రేణులు, తాల్ వంటి అందమైన సరస్సులు.... చాలా బాగుంటాయి. మనసుకు గట్టిగా హత్తుకుపోతుంది. ఈ ప్రయాణ దూరం 427 కిలోమీటర్లు. అయితే బాగా మంచు కురిస్తే మాత్రం ఈ హైవే మూసేస్తారు. అందుకని ప్లాన్ చేసేముందు అక్కడి వాతావరణం గురించి తెలుసుకోవడం బెటర్.
చెన్నయ్ నుంచి పాండిచ్చేరి : దీన్నే ఈస్ట్ కోస్ట్ రోడ్ అంటారు. సముద్రతీరం వెంబడి చేసే సుందరమైన జర్నీ. సముద్రం మీద నుంచి వచ్చే సన్నటి చలిగాలులు, పైన్ చెట్లు, గమ్మత్తైన అనుభవాన్ని అందించే ఉప్పు సముద్రం ఆహ్లాదకరమైన డ్రైవ్ ఎక్స్‌పీరియెన్స్ మిగులుస్తాయి. ఇది 152 కిలోమీటర్ల జర్నీ.
బెంగళూరు నుంచి ఊటీ: ప్రకృతి ప్రేమికులకు ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం ఇది అని చెప్పొచ్చు. తాజా, పచ్చిక గాలి, ఆకుపచ్చటి తివాచీలు పరిచినట్టు ఉండే వ్యూ చూసి తీరాల్సిందే. ఈ రోడ్డు జర్నీలో36 హెయిర్‌పిన్ బ్లెండ్స్, పెద్ద చెట్లు, ప్రకృతి ఫిల్టర్ చేసిన సూర్యకిరణాలు, పూలు అన్నీ అద్భుతాలే అంటే అతిశయోక్తి కాదు. ఇండియాలోనే స్టన్నింగ్ హైవే ట్రిప్ అవుతుంది ఇది. మొత్తం 265 కిలోమీటర్ల జర్నీ.
విశాఖపట్టణం నుంచి అరకు వ్యాలీ: ఈ హైవే జర్నీలో టౌన్లు, గ్రామాలు పలకరిస్తాయి. అరకు వ్యాలీ చేరుకునేలోపు ఫొటోలు తీసుకునేందుకు ఆగకుండా జర్నీ పూర్తి కాదు. ఈ జర్నీ దూరం115 కిలోమీటర్లు.
ముంబయి నుంచి పుణె ఎక్స్‌ప్రెస్ వే : వెస్టర్న్ ఘాట్స్నుంచి సాగే ఎంతో అందమైన ప్రయాణం. మంచును కప్పుకున్న ఆకాశం, వెడల్పాటి రోడ్లు, ఆకుపచ్చటి అందాలతో పాటు రోడ్డు పక్కన ఉండే తినుబండారాలు హైవే జర్నీ అలసటను తెలియనీయవు. అంతేకాదు మళ్లీ ఒకసారి హైవే జర్నీ అని మనసు అడిగేలా చేస్తుంది. ఈ దూరం148 కిలోమీటర్లు గ్యాంగ్‌టక్ నుంచి లేక్ ట్సోమ్ గో, నాథు లా పాస్ : ఇండియాలోని ఈశాన్య ప్రాంతంలో గ్యాంగ్‌టక్ నుంచి లేక్ ట్సోమ్గో, నాథు లా పాస్ థ్రిల్లింగ్ రైడ్ ఒక ఛాలెంజ్.
జీవితంలో ఒక్కసారైనా ఈ జర్నీ చేయాలి. ప్రకృతి అందాలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈ ప్రయాణ దూరం 40 కిలో మీటర్లు.షిల్లాంగ్ నుంచి షోర వరకు (చిరపుంజి) : ఈశాన్య రాష్ట్రాల్లోనే మరో అందమైన జర్నీ షిల్లాంగ్ నుంచి సోహ్ర(చిరపుంజి) దారి. ఈ హైవేలో ప్రయాణం చాలాసార్లు మంచుతో స్వాగతం చెప్తుంది. మంచు పడుతున్నా, రోడ్డు క్లియర్‌గా ఉన్నా ఇక్కడి అందాలు ఊపిరి తీసుకోకుండా చూస్తూ ఉండిపోతారు. దీని దూరం 54 కిలోమీటర్లు.
చండీగఢ్ నుంచి కసోల్: హైకర్స్, అడ్వెంచర్ ఇష్టపడేవాళ్లకు కసోల్ బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. రోడ్డు ట్రిప్‌కి కూడా ఇది పాపులర్ డెస్టినేషన్. ఈ ప్రయాణం దారంతా మాటల్లో వర్ణించలేని అందాలు. దీని ప్రయాణ దూరం 280 కిలోమీటర్లు.
ప్లానింగ్ ఇలా...
హైవే లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే... ఎన్ని రోజులు ట్రిప్ అనేదాన్ని బట్టి డెస్టినేషన్స్ సెలక్ట్ చేసుకోవాలి. ఇటినరీ ప్లానింగ్ ముఖ్యం. బెస్ట్ రూట్చూసుకుని, ఎక్కడ రెస్ట్ స్టాప్స్ పెట్టుకోవాలి. హోటల్ బుకింగ్స్ ఎక్కడెక్కడ చేసుకోవాలి. అక్కడ చేయాల్సిన యాక్టివిటీలు ఏమన్నా ఉన్నాయా? అనే విషయాలను ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేయడం వల్ల బడ్జెట్ చేయి దాటిపోకుండా ఉంటుంది. ప్లాన్ బట్టి టూర్ ఉంటే ‘అయ్యో’ అనుకోవాల్సిన పరిస్థితులు ఎదురుకావు.
అలాగే కొన్ని స్నాక్స్, వాటర్ తీసుకెళ్లడం తప్పనిసరి. ప్లేలిస్ట్ తయారుచేసుకుని ఆ పాటలు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎంటర్టైన్ చేసే యాక్టివిటీలు ఇంకేవైనా... గేమ్స్, సినిమాలు వంటివి పట్టుకెళ్లొచ్చు. సైట్ సీయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. వీటన్నింటికంటే ముందు చూసుకోవాల్సింది వెహికల్ కండిషన్. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకోవాలి. స్పేర్టైర్ చెకప్ కూడా చేయించాలి. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కాంటాక్ట్ నెంబర్స్ రాసుకోవాలి. స్పీడ్ లిమిట్స్ దృష్టి పెట్టుకుని డ్రైవ్ చేయాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ధ్యాస రోడ్డు మీద ఉండటం కంటే సేఫ్టీ టిప్ ఏముంటుంది?
- కొన్ని వెహికల్స్‌లోనే నావిగేషన్ సిస్టమ్ ఉంటోంది. అది ఉన్నా కూడా స్మార్ట్‌ఫోన్‌లో జిపిఎస్ లేదా యాప్స్‌లో ఉండే మ్యాప్స్ చూసుకోవడం బెటర్.
- పిల్లలతో జర్నీ చేస్తుంటే కలరింగ్ పుస్తకాలు, స్నాక్స్ తీసుకెళ్లాలి. ఇవి వాళ్లకి ఎంటర్టైనింగ్గా ఉంటాయి. వాటితోపాటు మధ్యలో ఆగేందుకు సఫిషియెంట్ టైం పెట్టుకోవాలి.
- కార్ మాన్యుఫాక్చర్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఫోన్ నెంబర్ ఉండాలి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అవసరం. పొరపాటున ఏవైనా ప్రమాదాలు జరిగితే అవి పనికొస్తాయి. వెహికల్ బ్రేక్ డౌన్ అయితే ఎమర్జెన్సీ లైట్స్ యాక్టివేట్ చేయాలి. వెంటనే రోడ్డు మీద నుంచి వెహికల్‌ను కిందకు దింపి ఎమర్జెన్సీ బ్రేక్స్ వేయాలి. సాయం అందేవరకు వెహికల్లోనే ఉండాలి.