ఏలూరు వింత వ్యాధికి పురుగు మందుల అవశేషాలే కారణం

ఏలూరు వింత వ్యాధికి పురుగు మందుల అవశేషాలే కారణం

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పలువురి అస్వస్థతకు పురుగు మందుల అవశేషాలే కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వింతవ్యాధిపై సీఎం జగన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ఎయిమ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ (NICT) సహా ప్రఖ్యాత సంస్థలు  తమ అభిప్రాయాలను తెలిపాయి. అయితే అవి ఎలా మనుషుల శరీరాల్లోకి ప్రవేశించాయన్నదానిపై మరింత అధ్యయనం అవసరమని నిపుణులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం జగన్…ఢిల్లీ ఎయిమ్స్, NICT కి అధ్యయన బాధ్యతలను అప్పగించారు.

ఏలూరులో క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలని.. ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని జగన్ సూచించారు. ఫలితాల ఆధారంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ ల్యాబ్ లు ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎస్ నీలం సాహ్నిని సీఎం ఆదేశించారు. ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.