సోరోస్కు అవార్డు హాస్యాస్పదం.. ప్రెసిడెన్షియల్ మెడల్ ఇవ్వడంపై ఎలాన్ మస్క్ కామెంట్

వాషింగ్టన్: బిలియనీర్ జార్జ్ సోరోస్​కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్​పై రిపబ్లికన్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బైడెన్ సర్కార్ నిర్ణయాన్ని అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ సపోర్టర్లు తప్పు పడుతున్నారు. వివాదాస్పదుడైన వ్యక్తికి అవార్డు ఎలా  ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

సోరోస్​కు మెడల్ ఇవ్వడం హాస్యాస్పదమని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కామెంట్ చేశారు. ఇది అమెరికాకు మరో చెంపదెబ్బ లాంటిదని రిపబ్లికన్ పార్టీ లీడర్ నిక్కీ హేలి అన్నారు. కాగా, అమెరికన్ ఇన్వెస్టర్ అయిన జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం పని చేస్తున్నారు. అయితే ఆయన ఈ సంస్థ ద్వారా దేశవిదేశాల్లోని రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మొత్తం 19 మందికి.. 
ఈ ఏడాది మొత్తం 19 మందికి ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ ప్రకటించారు. ఈ అవార్డులను శనివారం వైట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ జో బైడెన్ అందజేశారు. ఈ 19 మంది దేశం కోసం, ప్రపంచం కోసం ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. జార్జ్ సోరోస్ తరఫున ఆయన కొడుకు అలెక్స్ సోరోస్ అవార్డు అందుకున్నారు. అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్, ఫుట్ బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, యాక్టర్స్ జె ఫాక్స్, డెంజెల్ వాషింగ్టన్ తదితరులు ఈ అవార్డు దక్కిన వారిలో ఉన్నారు. కాగా, ఐదుగురికి మరణానంతరం ఈ అవార్డు దక్కింది. వాళ్ల తరఫున కుటుంబసభ్యులు అందుకున్నారు.