టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించిన దాదాపు రూ.3.37 లక్షల కోట్ల విలువైన డీల్ నుంచి బయటికి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఫేక్ ఖాతాల సమాచారాన్ని ట్విట్టర్ పూర్తిగా అందించకపోవడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఈమేరకు ట్విట్టర్ కు మస్క్ ఓ లేఖను పంపారని ప్రముఖ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. అమెరికా వ్యాపార నియంత్రణ సంస్థలకు మస్క్ తరఫు న్యాయవాది సమర్పించిన నివేదికలోనూ ఈవివరాలను ప్రస్తావించారు. ఫేక్, స్పామ్ ట్విట్టర్ ఖాతాలు ఎన్ని ఉన్నాయి ? అనే దానిపై సమాచారం ఇవ్వాలని పదేపదే విజ్ఞప్తులు చేసినా.. ట్విట్టర్ స్పందించలేదని పేర్కొన్నారు. ఫేక్, స్పామ్ ఖాతాలు అనేవి ట్విట్టర్ వ్యాపార పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్న అత్యంత కీలకమైన అంశమని.. ఆ వివరాలను తమకు ఇవ్వకపోవడం సరికాదని మస్క్ తరఫు న్యాయవాదులు తెలిపారు.
ట్విటర్ చైర్మన్ బ్రెట్ టేలో ఏమన్నారు ?
ఈ పరిణామంపై ట్విటర్ చైర్మన్ బ్రెట్ టేలో ఘాటుగా స్పందించారు. విలీన ఒప్పందాన్ని అమలు చేయించే దిశగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ‘‘మస్క్ అంగీకరించిన ధరకే డీల్ జరిగేలా చూసేందుకు న్యాయపోరాటం చేస్తం’’ అని తెలిపారు. ఈవిషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు. అయితే ఒకవేళ ఈ డీల్ ను పూర్తి చేయలేకపోతే.. ఎలన్ మస్క్ రూ.7వేల కోట్లు బ్రేకప్ (పెనాల్టీ) ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ట్విట్టర్ కొనుగోలు డీల్ నుంచి సురక్షితంగా బయటపడాలనే ఉద్దేశంతోనే .. కంపెనీ షేరు ధరను తగ్గించారనే అభియోగాలతో కూడిన కేసును కూడా మస్క్ ఎదుర్కొంటున్నారు.
Elon Musk sends a letter to Twitter seeking to end USD 44 billion deal, citing lack of info on bot accounts: The Associated Press
— ANI (@ANI) July 8, 2022
చెప్పినట్టే చేశారు
గత మే నెలలో మస్క్ మాట్లాడుతూ.. ‘‘ట్విట్టర్ మొత్తం ఖాతాదారుల్లో స్పామ్ బోట్స్ ఖాతాలు 5 శాతం కంటే తక్కువున్నాయని ఆ సంస్థ నిరూపించుకునే వరకు కొనుగోలు డీల్ ను నిలుపుదల చేస్తున్నాను’’ అని ప్రకటించారు. స్పామ్, ఫేక్ ట్విటర్ ఖాతాల సమాచారాన్ని ఇవ్వకుంటే.. డీల్ ను రద్దు చేసుకుంటానని అప్పట్లోనే ఆయన స్పష్టం చేశారు. దీంతో స్పందించిన ట్విటర్ ఆయనకు ‘ఫైర్ హోస్’ యాక్సెస్ ను ఇచ్చింది. అందులో ప్రతిరోజూ ప్రజలు చేసుకునే మిలియన్ల కొద్దీ ట్వీట్ల సమాచారం ఎప్పటికప్పుడు నిక్షిప్తం అవుతుంటుంది. దాన్ని పరిశీలించి ఫేక్, స్పామ్ ఖాతాలు ఎంతమేర ఉన్నాయనే దానిపై ఒక అంచనాకు రావచ్చని మస్క్ కు సూచించింది. ఐదు శాతానికి మించి ఫేక్, స్పామ్ ఖాతాలు లేవని తెలిపింది. కానీ ట్విటర్ చెబుతున్న దాని కంటే ఎక్కువ సంఖ్యలో ఫేక్, స్పామ్ ఖాతాలు ఉన్నాయని అప్పట్లో మస్క్ అభిప్రాయపడ్డారు.
Twitter to sue Musk over termination of company's takeover bid
— ANI Digital (@ani_digital) July 9, 2022
Read @ANI Story | https://t.co/S5aueX5rqW#Twitter #ElonMusk #elonmusktwitter pic.twitter.com/48yFBAk2gH
