కట్టేందుకు రూ.7 కోట్ల కోట్లవుతుందన్న స్పేస్ ఎక్స్ సీఈవో
ఎలాన్ మస్క్. సంచలనాలకు మారు పేరు. ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ సీఈవో. ఆ మధ్య స్పేస్‌లోకి తన కారును పంపి సంచలనం సృష్టించారు. తర్వాత సరికొత్త రవాణా వ్యవస్థ ‘హైపర్‌లూప్’ను రుచి చూపించారు. తాజాగా మార్స్ గ్రహంపై సిటీ కడితే ఎంత ఖర్చవుతుందో లెక్కలేసి చెప్పారు. మార్స్‌పై సెల్ఫ్ సస్టెయినబుల్ సిటీని కట్టేందుకు పది లక్షల టన్నుల కార్గో అవసరమని, ఒక్కో టన్నుకు సుమారు 70 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. మొత్తంగా అన్ని వసతులున్న పూర్తి సిటీని కట్టడానికి రూ.7 లక్షల కోట్ల నుంచి రూ. 7 కోట్ల కోట్లవుతుందని లెక్కేశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. మరో 100 ఏళ్లలో మార్స్‌ను కాలనీగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు మస్క్ వెల్లడించారు. మున్ముందు ఏదో ఓ సమయంలో భూమిపై జీవరాశి నాశనమవుతుందని, కాబట్టి మనుషులకు బ్యాకప్ ప్లాన్ అవసరమని చెబుతున్నారు. ప్రతి 26 నెలలకోసారి మార్స్‌పైకి వెళ్లేందుకు మంచి పరిస్థితులుంటాయని గతంలోనే మస్క్ చెప్పారు. స్పేస్‌లోకి వెళ్లేందుకయ్యే ఖర్చును వీలైనంత వరకు తగ్గించేందుకు మస్క్ కృషి చేస్తున్నారు. అమెరికాలో ఓ మీడియం సైజు ఇల్లు కట్టేందుకయ్యే ఖర్చులోనే (రూ. 1.5 కోట్లు) స్పేస్‌కు వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. 2022 నాటికి మార్స్ గ్రహానికి రెండు పెద్ద ఫాల్కన్ రాకెట్లతో కార్గోను పంపనున్నట్టు గతంలోనే మస్క్ ప్రకటించారు.
