కౌడిపల్లి, వెలుగు : ఐదు రోజులుగా వ్యవసాయ బోరు బావులకు కరెంట్సరఫరా నిలిచిపోయింది. గత ఆదివారం గాలివాన బీభత్సానికి కౌడిపల్లి మండలం తునికి శివారులోని ఐదు ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో 11 కేవీ కరెంట్తీగలు తెగిపోయాయి. పలు స్తంభాలు విరిగి నేలకొరిగాయి. అయితే వాటికి మరమ్మతులు చేపట్టలేదు. దీంతో తెగిన వైర్లు, విరిగిన స్తంభాలు పొలాల్లో అలాగే ఉన్నాయి.
ఈ విషయమై సంబంధిత విద్యుత్ అధికారులకు చెప్పినప్పటికీ రిపేర్లు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా ఐదు ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరా బంద్చేయడంతో ఆయా ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో ఉన్న 70 వ్యవసాయ బోరుబావులు నడవని పరిస్థితి నెలకొంది. వానాకాలం సీజన్ రావడంతో పొలాలకు నీళ్లు పార బెట్టి దుక్కులు దున్నుకుందామంటే కరెంట్సరఫరా లేక ఇబ్బంది కరంగా ఉందని రైతులు వాపోతున్నారు.
రెండు రోజుల్లో రిపేర్లు పూర్తి చేస్తాం..
ఐదు రోజుల క్రితం గాలివాన బీభత్సానికి వైర్లు, స్తంభాలు తెగిపడ్డాయి. సంబధిత లైన్మన్ వెళ్లి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఆ ఏరియాలోని ట్రాన్స్ఫార్మర్లకు కరెంట్ సరఫరా నిలిపి వేశారు. మరమ్మతులు చేయడానికి మెటీరియల్ లేకపోవడంతో కొద్దిగా ఆలస్యం జరిగింది. సంగారెడ్డి నుంచి కావలసిన మెటీరియల్ తీసుకువచ్చి రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తిచేసి రైతులకు యథావిధిగా విద్యుత్ సరఫరా చేస్తాం.
కోటేశ్వరరావు, ఏఈ