తెలంగాణాలో తగ్గిన కరెంట్ వాడకం

  • రోజుకు 200–220 మిలియన్​ యూనిట్లలోపే వినియోగం
  • పడిపోయిన అగ్రికల్చర్ ​యూజ్.. ​చలితో తగ్గిన గృహ వినియోగం
  • సంక్రాంతి వరకు మరింత తగ్గనున్న విద్యుత్​ డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరెంట్ వినియోగం బాగా తగ్గింది.  వానాకాలం సాగు ముగియడం, చలి తీవ్రత పెరగడంతో వ్యవసాయంతోపాటు గృహ వినియోగం పడిపోయింది. ఫలితంగా ఈ నెల ప్రారంభం నుంచే కరెంట్​ వాడకం తగ్గుతూ వచ్చింది.  ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో రోజువారీ విద్యుత్​వినియోగం 300 మిలియన్​ యూనిట్లకు పైగా ఉంటే, ప్రస్తుతం  200 నుంచి 220 మిలియన్ యూనిట్లకే పరిమితమవుతున్నది. 

చలి తీవ్రత పెరుగుతుండడంతో సంక్రాంతి వరకు డిమాండ్​మరింత తగ్గుతుందని, ఆ మేరకు సప్లై కూడా తగ్గించాల్సి వస్తుందని విద్యుత్​ అధికారులు చెప్తున్నారు.  సంక్రాంతి తర్వాత వరినాట్లు పుంజుకోవడంతోపాటు చలి తగ్గడంతో అటు వ్యవసాయ, ఇటు గృహ విని యోగం పెరిగే చాన్స్​ఉన్నదని అంటున్నారు. 

తగ్గిన అగ్రికల్చర్, గృహ వినియోగం 

​వానాకాలం పంటల సాగు పూర్తవడం, యాసంగి సాగు ఇంకా ఊపందుకోకపోవడంతో వ్యవసాయ కరెంట్ వినియోగం గణనీయంగా తగ్గింది. గత​ నెల ప్రారంభం నుంచి  వరికోతలు జోరందుకోవడంతో అప్పటి వరకు భారీగా ఉన్న కరెంట్​ డిమాండ్​ క్రమంగా తగ్గుతూ వచ్చింది. తాజాగా, అది 10 వేల మెగావాట్ల కన్నా దిగువకు పడిపోయింది. దీంతో కరెంటు వాడకం తక్కువగా నమోదవుతున్నది.

 అదే సమయంలో చలికాలానికి తోడు ఇటీవల తుఫాన్​ ప్రభావంతో  వాతావరణం మరీ చల్లబడింది. ఈ నేపథ్యంలో చలితీవ్రత పెరిగి  ఫ్యాన్లు, ఏసీల వాడకం తగ్గి గృహ విద్యుత్​ వినియోగం పడిపోయింది. సంక్రాంతి వరకు గృహ  వినియోగం మరింత తగ్గే చాన్స్​ఉన్నదని విద్యుత్​ వర్గాలు పేర్కొంటున్నాయి. 

రోజుకు 100 మిలియన్​ యూనిట్ల వరకు తగ్గిన వాడకం

గత మార్చి,  ఏప్రిల్​ నెలలతోపాటు వ్యవసాయ విద్యుత్​ వినియోగం ఎక్కువగా ఉండే ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో  రాష్ట్రంలో రోజువారీ కరెంట్​వాడకం 304 మిలియన్​ యూనిట్ల దాకా ఉండేది. ప్రస్తుతం అది 200 నుంచి 230 మిలియన్​ యూనిట్లలోపే నమోదవుతున్నది. అంటే దాదాపు 100 మిలియన్​ యూనిట్ల కరెంట్ వాడకం తగ్గింది. 

రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ జెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో నుంచి హైడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, థర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నీ కలిపి  60 నుంచి 68 మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనిట్ల లోపే కరెంటు ఉత్పత్తి జరుగుతున్నది. సింగరేణి ద్వారా  మరో 20 నుంచి 24.5  మిలియన్​ యూనిట్లు వస్తుండగా, మిగతాదంతా సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనరేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్ల నుంచి కొంత,  నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెంట్​ఎక్స్చేంజీల నుంచి కొంత కొనాల్సి వస్తున్నది.  ఇలా బయట నుంచి కొనేది 84 నుంచి 111 మిలియన్ యూనిట్లకు పైగా ఉంటున్నది. 

యాసంగిలో పెరగనున్న డిమాండ్ 

ఈ యాసంగిలో వరిసాగు రికార్డు స్థాయిలో  70 లక్షల ఎకరాలు దాటుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది.  ప్రస్తుతం యాసంగి వరిసాగు ప్రారంభం దశలో ఉన్నది. సంక్రాంతి తర్వాత నాట్లు ఊపందుకోనున్నాయి. ఫిబ్రవరి నుంచి యాసంగి విద్యుత్​వినియోగం  పుంజుకొని,  మార్చినాటికి పీక్స్​కు చేరనున్నది.  గతంలో యాసంగిలో వరిసాగు ఎప్పుడూ 50 వేల ఎకరాలు మించలేదు. ఈ సారి 70 లక్షల ఎకరాల్లో సాగైతే విద్యుత్​ డిమాండ్​ కూడా కొత్త రికార్డులు అందుకునే అవకాశం ఉన్నది.  రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల బోర్లు ఉన్నాయి. 

ఈ సారి ప్రాజెక్టు కింద కాలువల ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉన్నా వారబంధీకే పరిమితం కానున్నారు. కాలువ నీళ్లు రాని రోజుల్లో బోర్లు ఫుల్​టైం నడిచే అవకాశం ఉన్నది. అదే సమయంలో కాలువ నీళ్లను కూడా మోటార్లు పెట్టి తోడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఎస్సారెస్సీ, వరద కాలువ, నాగార్జున సాగర్ లెఫ్ట్​ కెనాల్స్​ వెంట ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల కూడా విద్యుత్​ వినియోగం పెరుగొచ్చు. 

నిరుడు మార్చి నెలలో రికార్డుస్థాయిలో 15,623 మెగావాట్ల విద్యుత్​ డిమాండ్​ నమోదైంది.  ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈసారి  మార్చి, ఏప్రిల్​ నెలల్లో  15 వేల నుంచి 17 వేల మెగావాట్ల మైలు రాయిని దాటుతుందని ఎక్స్ పర్ట్స్​ చెప్తున్నారు. ఆ మేరకు డిమాండ్​ను తట్టుకునేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది.