చంద్రబాబు, నితీశ్.. కింగ్ మేకర్స్

  • కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూ 
  • ప్రస్తుతం ఎన్డీయేలోనే రెండు పార్టీలు  
  • చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఫోన్ 

న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమిలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కింగ్ మేకర్స్ గా మారారు. ఈసారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ఈ రెండు పార్టీలు కీలకంగా మారాయి. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 293 సీట్లు రాగా, ఇందులో బీజేపీకి సొంతంగా 240 సీట్లు వచ్చాయి. ఇక టీడీపీ 16, జేడీయూ 12 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272 కాగా, ఎన్డీయే 293 సీట్లతో స్పష్టమైన మెజార్టీ దక్కించుకుంది. అయితే ఇందులో టీడీపీ, జేడీయూ సీట్లు కలిపి 28 ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలే కూటమిలో కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 352 సీట్లు గెలుచుకుంది. బీజేపీ ఒంటరిగానే 303 సీట్లు దక్కించుకుంది. కానీ ఈసారి బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాలేదు. 

ఏపీలో కూటమికే 21 సీట్లు.. 

ఈసారి ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ కూటమి రూలింగ్ పార్టీ వైసీపీని చిత్తు చేసి అధికారాన్ని సొంతం చేసుకుంది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 అసెంబ్లీ సీట్లను దక్కించుకున్నాయి. ఇక లోక్ సభ ఎన్నికల్లోనూ కూటమికే అత్యధిక సీట్లు వచ్చాయి. టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3 సీట్లలో విజయం సాధించాయి. మరోవైపు బిహార్ లో ఎన్డీయే కూటమికి 30 సీట్లు వచ్చాయి. ఇందులో బీజేపీకి 12, జేడీయూకు 12 సీట్లు ఉన్నాయి. 

బీజేపీ హైకమాండ్ అలర్ట్.. 

ఈసారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ఆ పార్టీ హైకమాండ్ అలర్ట్ అయింది. ఎన్డీయే కూటమిలోని తమ మిత్రులను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నది. రిజల్ట్ వచ్చిన వెంటనే టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.